Wednesday, March 12, 2025

హత్యలతో పరువు నిలుస్తుందా?

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడలో ఆరేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు తాజాగా ఓ కొలిక్కి రావడం ముదావహం. ప్రధాన నిందితుడికి ఉరిశిక్షను, మిగిలిన ఆరుగురికీ యావజ్జీవ కారాగారాన్ని విధిస్తూ నల్లగొండ రెండో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు హతుడు ప్రణయ్ తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకే కాకుండా ఈ దారుణ సంఘటన గురించి విని కలతపడిన ఎందరికో ఊరట కలిగించిందనడంలో సందేహం లేదు. చిన్ననాడే చివుళ్లు తొడిగిన స్నేహం ప్రేమగా మారి, పెళ్లితో ఆ జంట ఒక్కటైతే, అమ్మాయి తండ్రి పరువు పేరిట అబ్బాయిని పథకం ప్రకారం తుదముట్టించిన తీరు మానవతావాదులందరినీ కంటతడి పెట్టించింది. సాధారణంగా ఇస్లామిక్ దేశాలలో వినబడే పరువు హత్య అనే పదానికి ఇండియా దగ్గరై చాలా ఏళ్లే అయింది. భిన్న కులాలు, మతాలకు ఆలవాలమైన భారతీయ సమాజం ఇలాంటి ఘోరాలు, దారుణాలకు ఎన్నో ఏళ్లుగా సాక్షీభూతంగా నిలుస్తోందంటే ఆశ్చర్యం లేదు.

కులమతాల పట్టింపులు ఎక్కువగా కనబడే హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ దురాగతాలు ఎక్కువ కాగా, ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అడపాదడపా పరువు హత్యలు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం చూసినా రానురాను పరువు హత్యలు పెరుగుతున్నాయన్న సంగతి విశదమవుతుంది. తమ కులానికో, మతానికో చెందనివారిని పెళ్లి చేసుకున్నారనే ఆవేశంతో, పరువు మంటగలిసిందనే ఆక్రోశంతో.. కనీపెంచి పెద్ద చేసిన కన్నబిడ్డలనే చేజేతులా చంపుకుంటున్నారు. ఇటీవల సూర్యాపేటలో కృష్ణ అనే యువకుడు తమ కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో అమ్మాయి తరఫువారు పథకం ప్రకారం మట్టుబెట్టగా, తనకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ను సోదరుడే హైదరాబాద్‌లో నడిరోడ్డుపై కిరాతకంగా నరికి చంపాడు. బహిరంగంగా జరిగే ఇలాంటి కొన్ని పరువు హత్య లు వెలుగు చూస్తుండగా, గుట్టుమట్టుగా సాగిపోయే కొన్ని హత్యలు పోలీసుల వరకూ రావడం లేదు. తన కూతురో, కుమారుడో కులాంతర వివాహం చేసుకున్నాడనే ఆగ్రహంతో కన్నబిడ్డనే కుటుంబ పెద్ద కడతేర్చినప్పుడు, ఇతర కుటుంబ సభ్యులకు తెలిసినా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు సరికదా, తమ పరువు నిలిపేందుకు కుటుంబ పెద్ద చేసిన త్యాగంగా జరిగిన సంఘటనను భావించడం దీనికి కారణం.

విచారమేమంటే, పరువు హత్యలపై ఇదమిత్థమైన చట్టాలేవీ లేకపోవడం. పరువు హత్యలకు సంబంధించిన కేసుల దర్యాప్తునకు, విధించే జరిమానాలు, శిక్షలకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ ప్రత్యేకమైన చట్టాల రూపకల్పన జరగాలని లా కమిషన్ పన్నెండేళ్ల క్రితం తన 242వ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నా ఆ దిశగా ఇప్పటివరకూ సరైన ప్రయత్నాలు జరగలేదనే చెప్పాలి. ఇండియన్ పీనల్ కోడ్‌లో పరువు హత్యల ప్రస్తావన, అందుకు తగిన శిక్షలగురించిన వివరణ లేకపోగా, తాజాగా దాని స్థానంలో గత ఏడాదే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితలోనూ స్పష్టత లేకపోవడం విచారకరం. అయితే 302 సెక్షన్‌లో మరణశిక్ష, యావజ్జీవ ఖైదు, జరిమానాలతోపాటుగా కులమతాలు, అటువంటివాటి కారణంగా సామూహికంగా సాగించే హత్యాకాండను కూడా చేర్చడం కొంతలో కొంత నయం.

సాటి కులస్థులలో తమ పరువు పోయిందనే ఆక్రోశంతో పరువు హత్యలకు పాల్పడేవారు పర్యవసాల గురించి ఆలోచించరు. అలాంటివారికి మిర్యాలగూడ ఉదంతం కనువిప్పు కావాలి. తన కుమార్తెను వివాహం చేసుకుని, తన పరువు తీశాడనే ఆగ్రహంతో అమ్మాయి తండ్రి పథకం ప్రకారం ప్రణయ్ ఉసురు తీసినా, తదనంతర పరిణామాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కన్నబిడ్డల ప్రేమను అర్థం చేసుకోకుండా మొగ్గలోనే వారి ప్రేమను కాలరాచే కిరాతకులకు ఈ కేసు ఓ హెచ్చరిక లాంటిది. ఈ సందర్భంగా తీర్పు అనంతరం హతుడు ప్రణయ్ తండ్రి ‘ఇలాంటి పరువు హత్యల వల్ల సాధించేదేమిటి? నా కోడలికి భర్త లేడు. నాకు కొడుకు లేడు. నా మనవడికి తండ్రి లేడు. ఈ తీర్పుతోనైనా ఇలాంటి హత్యలు ఆగిపోవాలి’ అంటూ చేసిన ఆవేదనాభరిత వ్యాఖ్యలు అర్థం చేసుకోదగినవి. ఆయన ఆకాంక్ష నెరవేరాలని, ఇలాంటి పరువు హత్యలకు ఇకనైనా అడ్డుకట్ట పడాలని ఆశిద్దాం. నాగరిక సమాజంలో మరొకరి ప్రాణం తీసే హక్కు ఏ కులానికీ, ఏ మతానికీ, ఏ వ్యవస్థకూ లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News