Monday, December 23, 2024

మున్సిపల్ నిధులు దుర్వినియోగం

- Advertisement -
- Advertisement -

కీసర: నాగారంలో అనుమతులు లేని అక్రమ లేఅవుట్‌లో భూగర్భ మురుగు కాలువ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించి మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని కౌన్సిలర్ చింతల సరిత రమేష్ ఆరోపించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి రెవెన్యూ సర్వే నంబర్లు 758, 759, 761లో 15 ఎకరాలలో ఎలిఫెంట్ కాలనీ పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా లే అవుట్ చేశారని అన్నారు. లే అవుట్ నిర్వాహకులు కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండానే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి విక్రయించారని చెప్పారు. అక్రమ లే అవుట్‌లో భూగర్భ మురుగు కాలువ నిర్మాణం చేపట్టేందుకు మున్సిపల్ నిధుల నుండి రూ.25 లక్షల నిధులు కేటాయిండాన్ని కౌన్సిలర్ సరిత రమేష్ ఆక్షేపించారు.

లే అవుట్ నిర్వాహకులు భూగర్భ మురుగు కాలువ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధ్దంగా ఉన్నప్పటికి మున్సిపల్ నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ లే అవుట్‌లో భూగర్భ మురుగు కాలువ నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ చేసిన తీర్మాణాన్ని రద్దు చేయాలని కౌన్సిలర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ప్రజల కోరిక మేరకే మురుగు కాలువ నిర్మాణం : ఛైర్మన్
రాంపల్లిలోని ఎలిఫెంట్ కాలనీలో సమస్యలు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ప్రజల కోరిక మేరకు భూగర్భ మురుగు కాలువ నిర్మాణం చేపట్టేందుకు తీర్మాణం చేసినట్లు మున్సిపల్ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి తెలిపారు. కౌన్సిలర్ సరిత రమేష్ గౌడ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. లే అవుట్ నిర్వాహకులు ప్లాట్లు విక్రయించి సౌకర్యాలు కల్పించలేదని, వారు స్పందించక పోవడంతోనే మున్సిపల్ నిధులతో భూగర్భ మురుగు కాలువ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించామని చెప్పారు. లేఅవుట్ నిర్వాహకులు పనులు చేపట్టేందుకు ముందుకు వస్తే మున్సిపల్ నిధులను మరో చోటుకు బదిలీ చేస్తామని ఇందుకు రెండు నెలలు వేచి చూస్తామని అన్నారు. అవినీతికి తావు లేకుండా పట్టణంలో అత్యంత పారదర్శకంగా అభివృద్ధ్ది పనులు చేపడుతున్నామని ఛైర్మన్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News