Monday, December 23, 2024

దయనీయంగా కచ్చామోరీలు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : పాతబస్తీలో కచ్చామోరీల నిర్వాహణ దయనీయంగా మారింది. నామ్కేవాస్తే పనులతో కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. ఫోటోలు తీసి బిల్లులు మాత్రం తీసుకుంటున్నారు. కచ్చామోరీలలోని పూడిక అలాగే ఉండిపోయి చినుకు పడితే చాలు మ్యాన్‌హోళ్లు ఉప్పొంగుతున్నాయి. విచిత్రమేమంటే రోజు విడిచి రోజు మంచినీరు సరఫరా అయ్యే సమయంలో, చిన్నపాటి వర్షానికే సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. జీహెచ్‌ఎంసి చార్మినార్ జోన్, చాంద్రాయణగుట్ట సర్కిల్‌లోని జంగమ్మెట్ డివిజన్ ఛత్రినాక శివగంగానగర్‌ను ఈ సమస్య గత కొన్ని రోజులుగా పీడిస్తుంది. ప్రతియేడు వర్షాకాలంలో కచ్చామోరీలలోకి వెళ్ళాల్సిన వరద నీరు ఉప్పొంగి తిరిగి రోడ్లపైకి, బస్తీలలోకి ప్రవేశిస్తుంది.

తద్వారా రోడ్లు, బస్తీలు చెత్తాచెదారం, వ్యర్థాలు, నల్లటి బురద, దుర్గందంతో నిండిపోతున్నాయి. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసి అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం కనిపించటం లేదు. వర్షాకాలానికి ముందు వేసవిలో కచ్చామోరీలలో తూతూమంత్రంగా పూడిక తీసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించటం లేదు. తాజాగా శివగంగానగర్ శివాలయం ప్రధాన రోడ్డులో ఈనెల ఏడున కచ్చామోరీ పొంగిపొర్లి రోడ్డు, బస్తీని నల్లటి బురద, వ్యర్థాలు ముంచెత్తాయి. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసి దృష్టికి తీసుకువెళ్ళగా తొమ్మిదవ తేదీన ఇద్దరు కార్మికులు ఒక మ్యాన్‌హోల్‌లోని పూడిక కొంత వరకు తీశారు. వెదురు బద్దతో మ్యాన్ హోల్ నుండి మ్యాన్‌హోల్‌కు మధ్య గల పైప్‌లో అడ్డంకులను తొలగించేందుకు ప్రయత్నించి చేతులెత్తేశారు. తీసిన పూడికను సైతం అక్కడే వదిలేశారు.

ఫలితంగా గత రెండు రోజులుగా మ్యాన్‌హోల్ యథాస్థితికి చేరుకుంది. గురువారం ఉదయం ఆరున్నర గంటల నుండి 11 గంటల వరకు ఏకధాటిగా ఉప్పొంగి బస్తీని, రోడ్లను ముంచెత్తితింది. కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఇంటి ముందుకు వచ్చిన చెత్త ట్రాలీలో సైతం చెత్తవేసే వీలు లేకుండా రోడ్డంతా బురదనీరు విస్తరించి ప్రవహించింది. దుర్గందంతో బస్తీవాసులు ఇబ్బంది పడ్డారు. స్థానికులు ఈ దృశ్యాలను జీహెచ్‌ఎంసి చార్మినార్ జోన్ అధికారులకు చేరవేశారు. అందుకు స్పందించిన అధికారులు పారిశుధ్య కార్మికుల సహాయంతో మరోసారి మ్యాన్‌హోళ్ళలో పూడిక తీయించారు. ఈసారి రెండవ వైపు మ్యాన్‌హోల్‌లో పూడిక తీయటంతో దాని నుండి రాళ్ళు, గుడ్డలు, ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. రెండు మ్యాన్‌హోళ్ళలో లోతుగా పూడికను తీశారు. ఫలితంగా మురుగును సాఫీగా ముందుకు వెళ్ళేందుకు వీలు కలిగింది. అయితే ఈ సమస్యకు ఇక్కడే బ్రేకు పడుతుందా మరోసారి ఉప్పొంగుతుందాని బస్తీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News