Tuesday, March 25, 2025

ఎన్నికలకు ముందు రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు రద్దు అంటూ దుష్ప్రచారం

- Advertisement -
- Advertisement -

ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు
కేంద్రంపై ఈ తరహా దుష్ప్రచారం దుర్మార్గమన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: గడచిన పార్లమెంటు ఎన్నికలకు ముందు బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తాదంటూ పెద్ద ఎత్తున మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్, తదితర ప్రతిపక్షాలు ఇప్పుడు డీలిమిటేషన్ చేపడితే దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ సరికొత్త కుట్రలకు తెరలేపారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ, రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం జరిగిందని, అవేవీ ఫలించకపోవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ముందు పెట్టి ఇప్పుడు డీలిమిటేషన్ అంశంపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, డిఎంకె, కమ్యూనిస్టు పార్టీలు ఉత్తర- దక్షిణ భారతదేశం మధ్య విభజన తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్న ఆయన భవిష్యత్తులోనూ చేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ ఎన్‌డిఏ మిత్రపక్షంగా అధికారంలో ఉందని, కర్ణాటకలోనూ పార్టీ బాగా పుంజుకుందని, తమిళనాడులో కూడా తమ పార్టీ విజయావకాశాలను మెరుగుపర్చుకుంటుందని అన్నారు. దక్షిణాదిలో తమ పార్టీకి ప్రజల నుంచి సానుకూల వాతావరణం అవసరమైనప్పుడు డీలిమిటేషన్ పేరుతో తామెందుకు అన్యాయం చేస్తామని ప్రశ్నించారు. అలా అన్యాయం చేయడం వల్ల ఇంకా తామే నష్టపోతామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీకి ఇటువంటి ఆలోచన ఏదీ లేదని, కోరి నష్టాన్ని తామెందుకు తెచ్చుకుంటామని చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో, తెలంగాణలో గెలిచేలా, తమిళనాడులో మరింత పట్టు సాధించేలా అంకితభావంతో పని చేస్తున్నామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికలతో పాటు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రజలు బీజేపీకి మద్దతుగా తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.

కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల అసలు రంగు ఇప్పుడు బయటపడింది

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై చెన్నై వేదికగా జరిగిన సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పోటీపడి మాట్లాడటం చూస్తుంటే వారి అసలు రంగు బయటపడిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు పార్టీలు ఒకే వేదికపై ఒకే అంశంపై కలిసి పని చేయడం, మాట్లాడడం చూస్తుంటే ఆ పార్టీల మధ్య స్నేహం ఉందన్న అంశం ప్రజలకు వెల్లడైందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాత బంధం బయటపడిందని చురకలు వేశారు. దేశంలో లేని సమస్యను సృష్టించి, బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటివరకు పార్లమెంటులో లేదా కేబినెట్లో ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.

కానీ, అవకాశవాద పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తూ దిగజరారుడు రాజకీయాలకు తెరలేపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీల స్వప్రయోజనాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్, డీఎంకే, బీఆర్‌ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుందని, డీలిమిటేషన్ విధివిధానాలపై ఇంకా చర్చే జరగలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాది ప్రజల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్న ఆయన దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదంటూ హితవు పలికారు. చెన్నైలో జరిగిన సమావేశానికి మరెందుకో ఎంఐఎంను తీసుకెళ్లలేదని ఎద్దేవా చేశారు.

హామీలపై దృష్టిపెట్టండి

ఎన్నిలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయడంపై దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆరు గ్యారంటీల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారని వాటి అమలుపై దృష్టిపెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపారు. ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలి గానీ, ఇంకా ఏమీ మొదలు కాని డీలిమిటేషన్ పేరుతో కేంద్రంపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. అసలు డీలిమిటేషన్ జరగాలంటే ముందుగా జనాభా లెక్కల సేకరణ జరగాలని, పార్లమెంటులో చట్టం చేయాలంటే మేధావులు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్న సంగతి చెన్నె సమావేశానికి వెళ్లిన వారికి తెలియకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు డీలిమిటేన్‌పై ఏమైనా చట్టాలు ఉన్నాయంటే అవి కాంగ్రెస్ హయాంలో చేసినవేనని గుర్తు చేశారు. కేవలం తమిళనాడులో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్టాలిన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇప్పుడు డీలిమిటేషన్ నాటకానికి తెరలేపారని అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీలు ఒక్కటైనా తెలంగాణ ప్రజల మద్దతుతో ఆ మూడు పార్టీలను సమర్థవంతంగా బీజేపీ ఎదుర్కొంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News