Saturday, December 21, 2024

ఆ ‘అందాల సుందరి’ చూపు… అంతరిక్షం వైపు

- Advertisement -
- Advertisement -

కొత్తగా మిస్ ఇంగ్లాండ్‌గా గత అక్టోబర్‌లో ఎంపికైన 27 ఏళ్ల జెసీకా గేగెన్‌కు ఇప్పుడు ఆకాశమే హద్దు. అందాల సుందరిగా అంతరిక్షంలో అడుగు పెట్టాలని జెసీకా గేగెన్ గాఢంగా కాంక్షిస్తోంది. ఆమె చూపంతా నక్షత్రాల వైపే. బ్రిటన్ లోని లాంకెషైర్ లోని స్కెల్మెర్స్‌డేల్ కు చెందిన జెసీకా అంతరిక్షంలో వ్యోమగామిగా అడుగుపెట్టే తొలి అందాల సుందరి కావాలనే తన సుదీర్ఘకాల స్వప్నాన్ని నెరవేర్చుకోడానికి సిద్ధమౌతోంది. 2021లో మిస్ ఇంగ్లాండ్ రన్నర్‌గా వచ్చిన జెసీకా ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథ్స్ సబ్జెక్టుల్లో ఇతర యువతులకు స్ఫూర్తి కలిగించాలన్నది ఆమె ఆశయం.

ఏదోనాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్‌ఎస్) నుంచే పిల్లలకు చదువు చెప్పాలని కలలు కంటోంది. అంతరిక్షాన్ని సందర్శించాలనుకుంటున్న మొట్టమొదటి అందాల సుందరి, మోడల్ కూడా ఆమెయే. ఆమె ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ లివర్‌పూల్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేస్తోంది. రానున్న మూడేళ్లలో వ్యోమగామి కావాలని ప్లాన్ చేస్తోంది. అందమైన యువతులకు స్ఫూర్తి కలిగించడానికి మిస్ ఇంగ్లాండ్ వేదికను ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆమె ఏ మహిళా వ్యోమగామిగా చంద్రునిపై అడుగుపెట్టలేదని, వ్యోమగాముల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని నిర్లిప్తత వెలిబుచ్చింది.

నాసా ఆర్టిమిస్ కార్యక్రమంతో ఈ లోటు తీరే రోజు వస్తుందని , అప్పుడు మొదటి మహిళా వ్యోమగామి చంద్రునిపై పాదం మోపగలదని ఆశాభావం వెలిబుచ్చింది. ఇంజినీరింగ్ వంటి పురుషాధిక్య పరిశ్రమల్లో కూడా విజయం పొందాలని ఆమె ప్రయత్నిస్తోంది. “నా ఇంజినీరింగ్ డిగ్రీ నాకు అనేక అవకాశాలు కల్పించింది. ఏదో ఒక రోజు నా కల నెరవేర్చుకోడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి అప్లై చేస్తాను. డిగ్రీ పూర్తయిన తరువాత ఇండస్ట్రీలో మూడేళ్లు పూర్తి చేస్తాను. అప్పుడు వ్యోమగామిని కాడానికి ప్రయత్నిస్తానని జెసీకా వెల్లడించింది.

ఇంజినీరింగ్ అన్నది పురుషాధిక్య ప్రపంచం. ఇంజినీరింగ్ లోని వివిధ విభిన్న రంగాలలో బాలికలను విద్యావంతులు చేస్తా. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్,మ్యాథ్స్ (ఎస్‌టిఇఎం) లో మహిళలు కూడా రాణించగలరని నిరూపిస్తా. ” అని జెసీకా చెప్పింది. మా నాన్న పరిశ్రమల్లో పనిచేయడం చూశాక ఇంజినీర్‌ను కావాలని యవ్వనదశ నుంచి కూడా అనుకుంటున్నానని చెప్పింది. స్కూలులో మేథ్స్, సైన్స్ అంటే ఎంతో మక్కువ చూపేది. 15 ఏళ్ల వయసు లోనే మొదటిసారి మోడలింగ్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. మోడెలింగ్ కెరీర్‌లో ఉంటుండగానే 24 ఏళ్ల వయసులో సైన్స్ డిగ్రీ చదవడం ప్రారంభించింది. ఈ రెండు రంగాల్లో అనేక మెళకువలను ఆకళింపు చేసుకుంది. ఈ రెండు రంగాలు ప్రతిరోజూ వివిధ ప్రాజెక్టులపై ప్రపంచం అంతా పనిచేయడానికి అవకాశాలు కల్పించాయని పేర్కొంది. ఈ రెండింటిలో కొన్ని విషయాల్లో పోలికలు ఉండడంతో నా నేపథ్యం ఇంజినీరింగ్ ఎందుకు ఎంచుకున్నానో తెలిసింది.

గత ఆగస్టులో మిస్ ఇంగ్లాండ్‌గా స్థానం సంపాదించుకుంది. ఈ విజయం తరువాత తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని, తన వ్యక్తిత్వం బాలికల పురోగతికి తోడ్పడగలదని ఆమె ఆశిస్తోంది. వివిధ రంగాల్లో మహిళలు రాణించేలా వారిలో ఆత్మ విశ్వాసాన్ని ప్రోత్సహిస్తానని పేర్కొంది. ఇంజినీరింగ్ డిగ్రీతోనే త్వరలో మోడల్ అవుతానని, ఇది ఎంతో అద్భుతమని సంబరపడింది. లీసెస్టర్ లోనే మిస్ ఇంగ్లాండ్ ప్రధాన కేంద్రం ఉన్నందున అక్కడికి అనేక సార్లు వెళ్తున్నప్పుడు లీసెస్టర్ లోని నేషనల్ స్పేస్ సెంటర్‌ను ఆమె సందర్శించింది.అక్కడ ఎంతో తెలుసుకున్నానని చెప్పింది. తాను డిగ్రీ పొందాలని తనకు ఎంతో తపన ఉన్నా అంతరిక్ష సాంకేతికత పైనే మక్కువ చూపిస్తున్నట్టు చెప్పింది. ప్రతిరోజూ మనం నేర్చుకుంటూ ఉండాలి. జీవితం కోసం నేర్చుకోవాలన్నదే నా అభిప్రాయం అని జెసీకా తన మనోగతాన్ని వెల్లడించింది. 2023 లో జరగనున్న విశ్వసుందరి పోటీల్లో పాల్గొనడానికి ఇప్పుడు సిద్ధమౌతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News