Sunday, January 19, 2025

మిస్ యూనివర్స్‌గా డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా హెల్విగ్

- Advertisement -
- Advertisement -

డెన్మార్క్ అందాల భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ మిస్ యూనివర్స్ 2024 కిరీటం కైవసం చేసుకున్నది. విశ్వ సుందరిగా ఎంపిక అయిన డెన్మార్క్ బ్యూటీ వయస్సు 21 సంవత్సరాలు. అంతర్జాతీయ అందాల పోటీల్లో డెన్మార్క్ దేశానికి ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది విశ్వసుందరిగా నిలచిన విక్టోరియా హెల్వింగ్‌కు నిరుడు మిస్ యూనివర్స్‌గా గెలిచిన షెన్నిస్ పలాసియస్ (నికరాగువా) కిరీట ధారణ చేసింది. 125 మంది పోటీ పడిన ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో మొదటి రన్నరప్‌గా మెక్సికో సుందరి మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్, రెండవ రన్నరప్‌గా నైజిరియా ముద్దుగుమ్మ చిడిమ్మా అడెట్షినా ఎంపిక అయ్యారు. ‘కొత్త శకం మొదలైంది. 73వ విశ్వసుందరిగా గెలుపొందినందుకు అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం సాగాలని కోరుకుంటున్నాం’ అని మిస్ యూనివర్స్ టీమ్ తెలిపింది.

ఆమెకు ఫ్యాషన్ ప్రియులు అభినందనలు తెలియజేశారు. 2004లో సోబోర్గ్‌లో జన్మించిన విక్టోరియా బిజినెస్, మార్కెటింగ్‌లో డిగ్రీ పొందారు. ఆమె వ్యాపారవేత్తగా మారారు. ఆమెను నృత్యంలోను శిక్షణ పొందారు. మానసిక ఆరోగ్యం, మూగ జీవాల సంరక్షణ వంటి విషయాలపై ఆమె పోరాటం చేస్తున్నారు. అందాల పోటీల్లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఆమె మోడలింగ్‌లోకి ప్రవేశించారు. కాగా, ఈ విశ్వ సుందరి పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మిస్ ఇండియా (యూనివర్స్) రియా సింఘా టాప్ 12లో చోటు దక్కించుకోవడంలో విఫలమైంది. ఆమె ప్రాథమిక రౌండ్లలో రాణించినప్పటికీ అంతిమ రౌండ్ చేరేందుకు ఆ ప్రతిభ సరిపోలేదు. ఈ సారి మిస్ యూనివర్స్ పోటీల్లో టాప్ 12లో ఏడుగురు లాటిన్ అమెరికా దేశాలకు చెందినవారే. ఈ అందాల పోటీలు మెక్సికో దేశంలో జరిగాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News