2024 అందాల సుందరి కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఎగరేసుకుపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు చెందిన విశేషాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ముంబయిలో జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఫైనల్లో 111దేశాలనుంచి పాల్గొన్న అందాల భామలను ఓడించి ఆమె టైటిల్ ను గెలుచుకుంది.
క్రిస్టినా స్వస్థలం చెక్ రిపబ్లిక్ దేశంలోని ట్రినెక్ పట్టణం. ఆమె అక్కడే పుట్టింది. చిన్నప్పటినుంచి మోడలింగ్ పై ఆసక్తి పెంచుకుంది. లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పూర్తి చేసినా, మోడల్ గా స్థిరపడాలన్న లక్ష్యంతో లండన్ వెళ్లి, అక్కడ ఓ మోడల్ ఏజెన్సీలో చేరి శిక్షణ తీసుకుంది.
లండన్ నుంచి స్వదేశం చేరుకుని నేరుగా మిస్ చెక్ రిపబ్లిక్ పోటీల్లో పాల్గొని టైటిల్ గెలుచుకుంది. ఇక ఆ తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహకాలు ప్రారంభించి, చిన్న వయసులోనే లక్ష్యాన్ని సాధించింది. ప్రస్తుతం క్రిస్టినా వయసు 24 ఏళ్లే.
అన్నట్టు ఈ ముద్దుగుమ్మకు సంగీతంలోనూ ప్రవేశం ఉంది. ఫ్లూట్, వయొలిన్ వాయిస్తుంది. మాతృభాష స్లోవక్ తోపాటు ఇంగ్లీష్, జర్మన్, పోలిష్ భాషలు మాట్లాడుతుంది.
సమాజ సేవ అంటే మక్కువ ఎక్కువ. తన పేరు మీదుగా క్రిస్టినా పిస్కో ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఎంతోమందికి చేయూతనిస్తోంది.
క్రిస్టినా టాంజానియాలో పేద పిల్లలకోసం ఓ స్కూల్ కూడా నెలకొల్పింది. డబ్బు లేని కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదనే సదుద్దేశంతో ఆమె ఈ స్కూల్ ను ఏర్పాటు చేయడం విశేషం.