140 దేశాల ప్రతినిధుల రాకతో
హైదరాబాద్‌లో సందడి
ప్రభుత్వంపై భారం కేవలం
రూ.5కోట్లే అందాల పోటీలను
మహిళాసాధికారతకు ప్రతీకగా
చూడాలి: మంత్రి జూపల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం అతిథ్యమివ్వడం మనకెంతో గర్వకారణం అని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసే సువర్ణావకాశం దక్కుతుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ అందాల పోటీలను మహిళాసాధికారతకు ప్రతీకగా చూడాలని, రాజకీయ కోణంలో ఈ పోటీలను చూడడం సరికాదని ఆయన సూచించారు. ఫ్యూచర్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ ఈ ఈవెంట్‌కు వేదికగా నిలవడం గర్వం గా ఉందన్నారు. గురువారం బేగంపేట్ టూరిజం ప్లా జాలో మిస్ వరల్డ్ పోటీలకు చెందిన ప్రీ ఈవెంట్ మీడి యా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టూ రిజం కార్పొరేషన్ చైర్మన్ పి.రమేష్‌రెడ్డి, పర్యటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సిఈవో జూలియా మోర్లీ,
2024 ప్రపంచ సుందరి క్రిస్టి నా పిజ్కోవా, టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాష్‌రెడ్డి, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణారావు మాట్లాడుతూ తెలం గాణ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయ మని, ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, పర్యటక అందాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆలోచనల నుంచి వచ్చిందని, తెలంగాణ జానపద కళలను తెలియజేయడం, చారిత్రక, వారసత్వ కట్టడాలు, ప్రసిద్ద దేవాలయాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలను దర్శించేలా చేయడంతో పాటు తెలంగాణ, హైదరాబాద్ రుచులను పరిచయం చేసేందుకు ఇదొక అద్బుత అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు. ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణ సంస్కృతి సొగసులు అద్దేలా, భారతీయ వారసత్వ మూలాలలోనే వీటిని నిర్వహిస్తామని తెలిపారు.
ఇదెంతో చారిత్రాత్మకం
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ చారిత్రాత్మకమని, వేలాది ఏళ్ల చరిత్ర ఉన్న కొత్త రాష్ట్రంలో కొత్త కార్యక్రమం జరుగుతోందని, మహిళల ఆత్మసౌందరయ్యాన్ని సెలబ్రేట్ చేయడం మిస్ వరల్డ్ పోటీల ప్రధాన ఉద్దేశమని మంత్రి జూపల్లి చెప్పారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పదన్నారు. దక్షిణ కొరియాలో స్కిడ్ గేమ్, బిటిఎస్ బ్యాండ్ లాంటివి ఆదేశానికి ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణకు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్ధికంగా తోడ్పాటు కలిసివస్తుందని భావిస్తున్నట్లు మంత్రి వివరించారు. నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు, ప్రపంచస్థాయి పెట్టబడులు ఆకర్షించేం దుకు ఇది మంచి అవకాశమని, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందాల పోటీలను మహిళాసాధికారతకు ప్రతీకగా చూడాలని కోరారు. ప్రభుత్వంపైన విమర్శలు, రాజకీయ కోణంలోనే మిస్ వరల్డ్ పోటీలను చూడడం సరికాదని విజ్ఞప్తి చేశారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సాధారణంగా అతిథ్య రాష్ట్రంలో 50 : 50 భాగస్వామ్యంతో ఒప్పందం చేసుకుందని, ఈ పోటీలకు రూ.55 కోట్లు అంచనా వ్యయంకాగా రూ.27 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, మిగతా యాబైశాతం నిర్వాహకులు సమకూరుస్తారని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక భారం పడదని మంత్రి కృష్ణారావు తెలిపారు. ఈవెంట్‌లో స్పాన్సర్లను భాగస్వాములను చేస్తున్నామని, టూరిజం కార్పొరేషన్ రూ.5 కోట్లు మాత్రమే ఖర్చుచేస్తుందని వెల్లడించారు.
140 దేశాల ప్రతినిధుల రాక
మిస్ వరల్డ్ కార్యక్రమానికి దాదాపు 140 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని, ప్రపంచమంతా తెలంగాణ పై దృష్టిసారిస్తుందని తెలిపారు. అందాల పోటీలు అంటే ఇంకో కోణంలో చూడవద్దన్నారు.
తెలంగాణ త్రిలింగ దేశం
తెలంగాణ ప్రాంతం త్రిలింగ దేశంగా ప్రాముఖ్యతను కలిగి ఉందని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్ తెలిపారు. తెలంగాణకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉందని వాటి వివరాలను వెల్లడించారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, వేయి స్థంబాలగుడి, గోల్కొండ, కాకతీయ కోటలు, చార్మినార్ వంటి ఎన్నో గొప్ప కట్టడాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. మెడికల్ టూరిజంకు తెలంగాణ ఎంతో ప్రాముఖ్యత ఉందని, సినిమా, ఆహార రంగాల్లో తెలంగాణ పెట్టింది పేరు అని ఆమె తెలిపారు.
నమస్తే ఇండియా..
2024 ప్రపంచసుందరి క్రిస్టినా పిజ్కోవా “నమస్తే ఇండియా” అంటూ మీడియా ప్రతినిధులను పలుకరించారు. తెలంగాణ పర్యటన తనకు గొప్ప అనుభూతిని ఇస్తుందని తెలిపారు. ఇండియన్ కల్చర్, ఆర్ట్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నో భాషలు ఉన్నా అందరూ ఒక్కటిగా ఉండడం ఇండియన్ స్పిరిట్, భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడి ప్రత్యేకత అని తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించడం తనకు మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. తెలంగాణ పర్యటన తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు.