పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
పెరిగిన చలి తీవ్రత
హైదరాబాద్: వాయుగుండం తెలంగాణకు దూరంగా వెళ్లిపోవడంతో రాష్ట్రానికి తుఫాన్ ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగామారి తమిళనాడు, ఎపిల్లో బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున పుదుచ్చేరి, చెన్నై మధ్యలో వాయుగుండం తీరాన్ని దాటింది. ఉదయం 8.30 గంటలకు వెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. వాయుగుండం నుంచి ఉపరితలద్రోణి కోస్తాంధ్ర మీదుగా ఒడిశా వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించినట్టు ఆమె పేర్కొన్నారు.
తూర్పు దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల తెలంగాణకు తుఫాన్ ముప్పు తప్పిందని, కానీ శుక్ర, శని రాత్రి నుంచి మూడు రోజులపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌గర్ జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మనరాష్ట్రంలో వర్షాలు అంతగా లేకున్నా చలి తీవ్రత మాత్రం ఎక్కువయ్యింది. దాదాపుగా అన్ని జిల్లాలో 10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున అధికంగా మంచు కురవడంతో పాటు చల్లగా గాలుల తీవ్రత అధికమయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.