ఉత్తారాంధ్ర, దక్షిణ ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు వెళ్లే అవకాశం
తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేదు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం
హైదరాబాద్: రాష్ట్రానికి జవాద్ తుఫాను ముప్పు తప్పింది. జవాద్ తుఫాన్ ఉత్తారాంధ్ర, దక్షిణ ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు వెళ్లే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. తుఫాను కారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఆమె తెలిపారు. ఉత్తర ఈశాన్య దిశగా జవాద్ తుఫాన్ వెళ్లనుందని, థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతం పక్కనే ఉన్న అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు వ్యాపించి ఉందని ఆమె పేర్కొన్నారు. తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదిలి శుక్రవారం ఉదయంలోగా అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో తుఫానుగా మారి శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర- ఒడిశా తీరానికి చేరుకొని, ఉత్తర ఈశాన్య దిశగా వెళ్లే అవకాశం ఉందని ఆమె పేర్కొంది. ఈ తుఫాన్ ఉత్తర ఈశాన్యదిశగా వెళ్లే అవకాశం ఉండడంతో తెలంగాణకు తుఫాన్ ప్రభావం ఉండదని ఆమె స్పష్టం చేశారు. కాగా, తూర్పు దిశ గాలుల రాష్ట్రంలోకి వీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.