Sunday, December 22, 2024

భావోద్వేగాలా, ప్రజల సమస్యలా?

- Advertisement -
- Advertisement -

కాలం కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్నది. సరికొత్త రెక్కలు తొడుక్కొంటున్నది. ఎన్నో పరిణామాలను పూసగుచ్చిన 2023 పశ్చిమాద్రిన అస్తమిస్తున్నది. 2024 ఉషోదయానికి తెర లేస్తున్నది. నేటి కంటె రేపు మెరుగ్గా, సుఫలవంతంగా, శుభప్రదంగా ఉండాలని కోరుకోడం మానవ నైజం. అందుకే ఈ సందర్భాన్ని వేడుకగా చేసుకొంటున్నాము. రెండు యుద్ధాలను మిగిల్చి 2023 వెళ్లిపోతున్నది. వాటి దుష్పరిణామాలను మోస్తూ 2024లోకి అడుగుపెడుతున్నాము. ఉక్రెయిన్ యుద్ధం రష్యాకు, అమెరికాకు పరోక్ష యుద్ధంగా కొనసాగుతున్నది. అసంఖ్యాక ఉక్రెయిన్ ప్రజలను నిర్వాసితులను చేసి, పెక్కు మందిని బలి తీసుకొంటూ చెప్పనలవికాని విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఈ యుద్ధం ఎటువంటి ముగింపుకి చేరుతుందోననే ఉత్కంఠ చోటు చేసుకొన్నది. అమెరికా, యూరపు దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలను, ఆర్ధిక సాయాన్ని దండిగా అందిస్తూ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయి. ఇంకొక వైపు అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ రెచ్చిపోయి పాలస్తీనీయుల గాజాను శ్మశాన వాటిక చేస్తున్నది. మృతుల సంఖ్య 20 వేలకు చేరింది.

ముక్కుపచ్చలారని వేలాది మంది బాలల బలిపీఠంగా మారిపోయి గాజా ప్రపంచ మానవాళి ముఖాన, దాని మానవత్వం నుదుట అతిపెద్ద ప్రశ్నగా ఆవేదన కలిగిస్తున్నది. హమాస్ తెగించి గత అక్టోబర్ 7న జరిపిన దాడి వందల మంది ఇజ్రాయెలీలను బలి తీసుకొని ఈ ఘోర విషాదానికి దారి తీసింది. ఇజ్రాయెల్ రక్షణ కవచానికి తూట్లు పొడిచింది. 2024 అయినా ఈ రెండు మారణ హోమాలకు స్వస్తి వచనం పలకాలనే ఆశ కుసుమించడం సహజం. దేశాల మధ్య, జాతుల మధ్య, మతాలు, భిన్నసామాజిక వర్గాల మధ్య విభేదాలు ఘర్షణలుగా, మానవ వినాశక యుద్ధాలుగా మారకుండా నిరోధించే బలమైన అంతర్జాతీయ యంత్రాంగ లోపం భయోత్పాతానికి గురి చేస్తున్నది. అమెరికా ఏకపక్ష విర్ర వీగుడికి విరుగుడు ఇప్పట్లో కనిపించడం లేదు. 2024లో జరగనున్న అగ్ర దేశం అధ్యక్ష ఎన్నికలు ఎన్నో విపరిణామాల కర్త డోనాల్డ్ ట్రంప్‌ను తిరిగి ముందుకు తెస్తాయేమోననే భయానుమానాలు తలెత్తుతున్నాయి. ముగిసిపోతున్న సంవత్సరంలో స్వీయ నాయకత్వంలో జి 20 దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని అట్టహాసంగా జరిపించి అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్న ఇండియా అయోధ్యలో మహా రామాలయ ఆవిష్కరణ ఘట్టం (జనవరి 22) తో 2024ను చరిత్రాత్మకం చేయబోతున్నది.

దీనికి పూర్వరంగంలో సంభవించిన పరిణామాలు దేశాన్ని ఎటు నుంచి ఎటు నడిపించాయో, సెక్యులర్ భారతాన్ని మతపరమైన చీలుబాటల వెంట ఎలా అడుగులు వేయించి ఎంతటి నెత్తురోడించాయో, అవి పాలనా పగ్గాలు ఎటువంటి శక్తుల చేతికి అందించాయో పర్యవసానంగా నిన్నమొన్నటి అధికరణ 370 రద్దు ఖరారు వరకు ఎటువంటి మార్పులు సంభవించాయో తెలిసిందే. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనతోనైనా వైషమ్య భారతం తిరిగి సెక్యులర్ సామరస్య ధామంగా మారగలదనే ఆశలకు అవకాశం కలగడం లేదు. దండయాత్రల గతాన్ని తవ్వడం ద్వారా ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలు గరిష్ఠ స్థాయికి రెచ్చగొట్టి వర్తమానాన్ని పుంజు కత్తుల కదన రంగాన్ని చేసి రాజకీయ లబ్ధి పొందడానికి అలవాటు పడిన పాలక భారతీయ జనతా పార్టీ 2024 సాధారణ ఎన్నికలకు ముందు ఆలయ ఆరంభ సన్నివేశాన్ని వైభవోపేతంగా జరిపించబోడంలోని ఆంతర్యం తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు ప్రముఖులు స్పందించిన తీరును ప్రస్తావించుకోడం సముచితంగా ఉంటుంది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఫారుఖ్ అబ్దుల్లా రామాలయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. అదే సందర్భంలో రాముడు హిందువులకు మాత్రమే చెందినవాడు కాడని , ప్రపంచంలోని అందరివాడని అన్నారు.

అతడు సోదరభావాన్ని, ప్రేమను, ఐక్యతను బోధించాడని, ఈ ఆలయ ఆరంభ సందర్భంగా ఆ మహదాశయాలను పాటించవలసిందిగా కోరుతున్నాను అని అబ్దుల్లా అర్ధించారు. అలాగే దేశంలో టెలికం విప్లవ ఆద్యుడు శ్యాం పిట్రోడా ఆలయ అట్టహాస ఏర్పాట్లను ప్రస్తావిస్తూ మతం వ్యక్తిగతమని, దానిని రాజకీయంతో కలపొద్దని అన్నారు. రామ మందిరం అసలు సమస్య కాదని, నిరుద్యోగం, అధిక ధరలు వంటి ప్రజా సమస్యలను పట్టించుకోవాలన్నారు. అబ్దుల్లా గాని, పిట్రోడా గాని ప్రతిపక్ష నేతలు అయినంత మాత్రాన వారు వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలను త్రోసిపుచ్చలేము. ప్రపంచంలోని అత్యధిక పేదలు మన దేశంలోనే ఉన్నారంటే పేదరిక నిర్మూలనే పాలకుల ప్రధాన లక్ష్యం కావాలి, భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోడం ఎంతమాత్రం కాదు. ఈ హితోక్తులను వారు వింటారా? రాముడు పేదల పక్షపాతి. రామరాజ్యం అంటే విద్వేషాలకు, విభజన రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను సుభిక్షంగా ఉంచడమేనని పాలకులు తెలుసుకొని నడచుకోవాలి. ఇదే అసలైన నూతన సంవత్సర సందేశం కావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News