న్యూఢిల్లీ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఒక భారతీయ ఔషధ సంస్థ గోదాంపై ఇటీవల క్షిపణి దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి కీవ్‌లోని ప్రాసిక్యూటర్ జనరల్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆ ఘటనపై రష్యా, ఉక్రెయిన్ మధ్య మాటల పోరు సాగుతోంది. ఆ దాడి తమ పని కాదని, అది ఉక్రెయిన్ క్షిపణి అయి ఉండవచ్చునని భారత్‌లోని రష్యా కార్యాలయం ప్రకటించింది. ఆ ప్రకటనపై ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ స్పందించింది. ఉగ్రవాదాన్ని సమర్థించుకునే చర్య సరి కాదని, ఒక సీనియర్ నేరస్థుడు ఎప్పుడూ తన నేరాలను అంగీకరించడని ఉక్రెయిన్ ఎంబసీ వ్యాఖ్యానించింది. రష్యా చేస్తున్న వాదనలో ఏమాత్రం విశ్వసనీయత లేదని ఎంబసీ పేర్కొన్నది.
ఆ క్షిపణి దాడులు పొరపాటున జరిగాయని మాస్కో వాదిస్తోందని, ఆ వాదనను అమెరికా కూడా నమ్ముతోందని ఉక్రెయన్ ఎంబసీ పేర్కొన్నది.కుసుమ్ అనే సంస్థకు చెందిన ఫార్మా గిడ్డంగిపై కొన్ని రోజుల క్రితం దాడి జరిగింది. రష్యా ఉద్దేశపూర్వకంగానే భారతీయ సంస్థలను లక్షంగా చేసుకుంటున్నదని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాంపై దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. భారత్‌తో స్నేహం ఉందని చెబుతూనే రష్యా అలా దాడుల చేయడం సరి కాదని ఎంబసీ వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ రాయబార కార్యాలం చేసిన వ్యాఖ్యలపై రష్యా రాయబార కార్యాలయం కూడా స్పందించింది. భారత్‌కు చెందిన ఫార్మా గోదాంపై రష్యా సాయుధ బలగాలు దాడి చేయలేదని రష్యన్ ఎంబసీ స్పష్టం చేసింది.