మన తెలంగాణ/హైదరాబాద్/మేడ్చల్: హైదరాబాద్‌లో అదృశ్యమైన బిటెక్ విద్యార్ధిని వర్షిణి ఆచూకీని ముంబైలో పోలీసులు ఆదివారం గుర్తించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కండ్లకోయ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్రనగర్ నివాసి వర్షిణి బిటెక్ చదువుతుంది. పరీక్షలున్నందున ఈ నెల 8న సాకిరెడ్డి వర్షిణిని మోహన్ రెడ్డి అనే బంధువు కాలేజీ వద్ద డ్రాప్ చేశాడు. అయితే కాలేజీ ఐడెంటెటీ కార్డు, మొబైల్ మర్చిపోయాయని చెప్పి ఆమె కాలేజీ నుండి వెళ్లిపోయింది. అయితే ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వాకబు చేశారు. అయితే కాలేజీ నుండి మధ్యలోనే వెళ్లిపోయిందని కాలేజీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వర్షిణి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వర్షిణి కాలేజీ నుండి బయటకు వచ్చిన దృశ్యాలను పోలీసులు సిసిటివి పుటేజీలో గుర్తించారు. వర్షిణికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముంబైలో ఓపెన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
టెక్నాలజీని ఉపయోగించి వర్షిణి ముంబైలో ఉన్నట్టుగా గుర్తించి ముంబై పోలీసులకు హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. ముంబైలోని కళ్యాణి ప్రాంతంలో వర్షిణి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. డిఫ్రెషన్ తో ఉన్నట్టుగా గతంలో వర్షిణి తన స్నేహితులకు చెప్పిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ దిశగా పోలీసులు విచారణ చేశారు. డిప్రెషన్ కారణంగానే వర్షిణి ముంబైకి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.వర్షిణి క్షేమంగా ఉన్నట్టుగా పోలీసులు కుటుంబ సభ్యలకు సమాచారం ఇచ్చారు.కాలేజీకి వెళ్లిన వర్షిణి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని కూడా కుటుంబ సభ్యులు భయపడ్డారు. అయితే వర్షిణి ముంబైలో క్షేమంగా ఉందని పోలీసులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షిణి డిప్రెషన్ కు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వర్షిణి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షిణిని ముంబై నుండి హైద్రాబాద్ కు తీసుకు రానున్నారు. వర్షిణి హైద్రాబాద్ నుండి ముంబైకి ఎలా వెళ్లిందనే విషయమై కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది.
Missing B.Tech Student Varshini Found in Mumbai