Monday, December 23, 2024

దేశానికే ఆదర్శంగా మిషన్ భగీరథ..

- Advertisement -
- Advertisement -

మక్తల్ : కెసిఆర్ మానస పుత్రికగా భావించే మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, దేశంలోని అన్ని రాష్ట్రాల పాలకులే ఆశ్చర్యపోయేలా ఇంటింటికీ శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం మంచి నీళ్ల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ మండలంలోని పారేవుల పంప్‌హౌజ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నారాయణపేట జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాగేందుకు నీళ్లు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఎంతో మంది ఆడబిడ్డలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకునే క్రమంలో తమ ప్రాణాలను సైతం కోల్పోయారన్నారు.

గతంలో తెలంగాణలోని ప్రతి పల్లెలో తాగునీటి కష్టాలు కనిపించేవన్నారు. కానీ తెలంగాణ స్వరాష్ట్రంలో కెసిఆర్ దృఢ సంకల్పంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఒక్క మక్తల్ నియోజకవర్గంలోనే దాదాపు 52వేల ఇండ్లకు తాగునీటి నల్లా కనెక్షన్లను ఉచితంగా ఇచ్చామన్నారు. మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులు అవహేళన చేశారని, కానీ నేడు ఆ నాయకులు సైతం ఇదే నీటిని తాగుతున్నారన్నారు. ప్రజల అభిమానం, ఆశీర్వాదం మెండుగా ఉన్నాయి కాబట్టే మక్తల్ ఎమ్మెల్యేగా మూడుసార్లు విజయం సాధించి ప్రజలకు సేవ చేస్తున్నానని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తనదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అడబిడ్డల కష్టాలు తీర్చిన ఘనత సిఎం కెసిఆర్‌దే..
తెలంగాణ ప్రాంతంలో గుక్కెడు నీళ్లు దొరక్క ఊళ్లన్నీ గోస పడ్డాయని, మిషన్ భగీరథతో తాగునీటిని ఇంటింటికి నేరుగా అందించిన సిఎం కెసిఆర్ ఆడబిడ్డల కష్టాలన్నీ తీర్చారని నారాయణపేట జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కె.వనజ ఆంజనేయులు గౌడ్ అన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ప్రభుత్వం మిషన్ భగీరథ నీటిని పంపిణీ చేస్తున్నదని, ప్రజలు ఇతర అవసరాలకు కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆమె అన్నారు.
గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి భూమిపూజ..
మక్తల్ మండలంలోని పారేవులలో రూ.20లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతి భవనానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ కె.వనజ ఆంజనేయులు గౌడ్ ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన పారేవుల అభివృద్ధికై తమవంతు కృషి చేస్తామని వారన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ సీఈఓ జ్యోతి, మిషన్ భగీరథ ఎస్‌ఈ వెంకటరమణ, ఎంపిడీఓ శ్రీధర్, ఎంపిపి వనజ, అధికారులు రంగారావు, నరేష్, అరుంధతి, బిఆర్‌ఎస్ నాయకులు మహిపాల్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఎంపిటిసి ఆశిరెడ్డి, సర్పంచులు వెంకటేశ్వర్‌రెడ్డి, అంకెన్‌పల్లి లక్ష్మణ్, కల్పన కృష్ణయ్య, మిషన్ భగీరథ సిబ్బంది ఉమాశంకర్ గౌడ్, రమేష్, రాజప్ప, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News