Sunday, December 22, 2024

తాగునీటి కష్టాలకు రామ్, రామ్

- Advertisement -
- Advertisement -

శివుని తలపై ఉన్న గంగను ప్రజల నీళ్ల కష్టాలను తీర్చడం కోస భువికి పంపినట్లు మనం చదువుకున్నాం. కానీ ప్రస్తుతం మనం తెలంగాణలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తెలంగాణ ఆడబిడ్డల తాగునీటి కష్టాలను మన అపర భగీరథుడు కెసిఆర్ తీర్చారు. అనేక ఏళ్లుగా చుక్క నీరు రాకుండా గొంతెండిన పల్లెలు దీనంగా ఎదురు చూశాయి. తలాపున గోదావరి ఉన్నా మన పల్లెలకు చుక్క నీరు రాక… ఆడ బిడ్డలు కిలోమీటర్ల కొద్దీ నడిచి తాగు నీటి కోసం పడరాని పాట్లు పడాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉండేది. ఊట బావులు, చెలిమేల నీళ్లను దోసిళ్లలో ఒడిసి పట్టుకున్నట్టుగా పరిస్థితులు ఉండేవి.

వేసవి కాలం వస్తే.. ఇంక అంతే సంగతులు. మండుటెండల్లో ట్యాంకర్ల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి పరిస్థితి. పంచభూతాలలో ఒకటైన నీరు మనకు అందకుండా సహజ వనరునూ దోపిడీకి గురైన సందర్భం. పిల్లను పెళ్లి చేసి ఇవ్వాలన్నా.. నీటి సమస్య లేని ఊరేతై బాగుండు అనుకునే సందర్భం అంతటి గోసను తెలంగాణ గడ్డ 60 ఏళ్లకు పైగా తిప్పలు పడ్డది. సహజ వనరులను తరలించుకుపోతున్నా దశాబ్దాలపాటు పాలించిన పాలకులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించని పరిస్థితి. అటువంటి అనేకమైన దోపిడీలకు తెలంగాణ గురైంది. సాగునీరు దక్కకున్నా.. కనీసం తాగునీరు కూడా మనకు దొరకక తిప్పలు పడిన తెలంగాణ నేల ఇప్పుడు తన పొత్తిళ్లలో నిండుగా జలాన్ని నింపుకుంది. ఆడ బిడ్డలకు గోస లేకుండా దీవిస్తున్నది. దానికి ఉద్యమ నేత ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చాలా గొప్పది.

తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగిన కెసిఆర్‌కు ఎదురైన సంఘటనలే పథకాల రూపంలో ప్రస్తుతం ప్రగతి వైపు పయనిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటగా కెసిఆర్ చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన పథకం మిషన్ భగీరథ. కేవలం రెండేళ్లలోనే ఈ పథకాన్ని ప్రారంభించి పూర్తి చేశారు. ప్రజల ఆరోగ్యాలను సంపూర్ణంగా ఉంచడంలో మంచినీటి పాత్ర కీలకం. అందుకోసం కలుషిత నీరు తాగి రోగాల బారీన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో సుమారు రూ. 47 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించి పనులను పూర్తి చేశారు. ఎక్కడికక్కడ పంప్ హౌస్‌లు నిర్మాణం చేపట్టడం వల్ల స్వచ్ఛమైన గోదావరి జలాలు మన ఇంటికి వస్తున్నాయి. ఒకప్పుడు తాగునీరు కావాలంటే.. ఇంట్లో ఒకరు నీటి కోసమే శ్రమపడాల్సిన పరిస్థితులలో నుంచి నేడు ప్రతి ఇంటి తాగు నీరు అందుతున్నది. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి పల్లె జలకళతో ఇంటి వద్ద కళకళలాడుతున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఈ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. సరైన తాగునీరు లేక అనేక మంది ఫోరోసిస్ బారినపడి తమ నిండైన జీవితాలు నాశనం అయిన పరిస్థితి. అయినా దశాబ్దాల తెలంగాణలో ఫ్లోరోసిస్ నిర్మూలనకు సరైన చర్యలు చేపట్టలేని పరిస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అక్కడ స్వచ్ఛమైన తాగు నీరు కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడంతో నల్గొండ పల్లెలు ఇప్పుడు ప్లోరోసిస్ నుంచి బయటపడుతున్నాయి. 2018 నాటికి తెలంగాణలోని ప్రతి పల్లెకు తాగునీరు అందిస్తామని లేకుంటే ఓట్లు అడగనని ఉద్యమ రథసారధి కెసిఆర్ చెప్పారు. అప్పట్లో అదొక పెద్ద సవాలే అయినప్పటికీ ఉద్యమంలా కృషి చేసి ప్రతి ఇంటికి మంచి నీరు అందించారు. సాక్షాత్తు పార్లమెంటులో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసించారు అంటే తెలంగాణ ఉద్యమ నేత పట్టుదలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మరో వైపు సాగు నీటి కోసం చేపట్టిన మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధ్దరణ ద్వారా కూడా ప్రతి పల్లె ఇప్పుడు జలకళతో నిండుకున్నాయి. ఒకప్పుడు పశువులకు తాగు నీరు దొరకని దీనస్థితి. సాగుకు నీరు లేక ఒక్కో రైతు ఐదారు బోరు తవ్వకాలు చేపట్టినా చుక్కనీరు రాక తెలంగాణ నేల బీటలు వారేది.

ఇప్పుడు పచ్చని పైర్లతో… ఆకుపచ్చని తోరణాలతో పల్లెలన్నీ మనకు స్వాగతం పలుకుతున్నట్లు దర్శనమిస్తున్నాయి. ప్రతి ఊరిలో మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ వల్ల చెక్ డ్యాంల నిర్మాణం, కాలువలు, చెరువులు నిండుకోవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా.. గంగమ్మ పరుగులు పెడుతూ కన్పిస్తుంది. ఇంటి అవసరాల తిప్పలు, తాగునీటి తిప్పలే కాదు… సాగు నీరు పుష్కలంగా ఉండడంతో పల్లెలన్నీ జలకళతో కళకళలాడుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి వల్ల గోదావరి జలాలతో సబ్బండ వర్గాలు ఇప్పుడు సంతోషంతో సంబురపడుతున్నాయి. ఇది ఉద్యమ నాయకుని ఉదారత. ఆడబిడ్డల గోసకు శాశ్వత పరిష్కారం చూపిన ఆ మహానేత కెసిఆర్‌కు కృతజ్ఞతలు.

సంపత్ గడ్డం
7893303516

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News