మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కాకతీయ యూనివర్సిటీ పాఠ్యాంశాలుగా మారాయి. రాష్ట్రంలో రక్షిత మంచినీరు, చెరువుల పునరుద్ధరణ ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల గురించి భవిష్యత్ తరాలకు గురించి తెలిసేలా కాకతీయ యూనివర్శిటీ చొరవ తీసుకుంది. కాకతీయ యూనివర్శిటీ బిఎస్‌సి డిగ్రీ సిలబస్‌లో మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పథకాలను చేర్చింది. నీటి వనరుల నిర్వహణ అంశాన్ని జనరల్ ఎలెక్టీవ్ సబ్జెక్ట్ కిందకు తీసుకొచ్చింది. బిఎష్‌సి మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఐదవ సెమిస్టర్ ఈ పథకాలకు సంబంధించిన వివరాలను పాఠ్యాంశంగా చేర్చింది.
వాటర్ రీసోర్సెస్, కన్వెన్షన్ అండ్ మెనేజ్‌మెంట్ అంశాలతో ఎస్.ఎన్.చటర్జీ రాసిన పుస్తకాన్ని, వాటర్ షెడ్ మేనేజ్‌మెంట్ గురించి జెవిఎస్ మూర్తి రాసిన పుస్తకాన్ని, అప్లయిడ్ హైడ్రో జియాలజీపై ఫెట్టర్ రాసిన పుస్తకాన్ని, గ్రౌండ్ వాటర్ హైడ్రాలాజీపై టాడ్ రాసిన పుస్తకాలను రిఫెరెన్సుగా పేర్కొన్నది. కాకతీయ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని మిషన్ భగీరథ కార్పొరేషన్ అధికారులు అభినందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాల ఫలాల గురించి భవిష్యత్ తర విద్యార్థులకు అందించడానికి ఈ కృషి తోడ్పడుతుందని తెలిపింది.