Wednesday, January 22, 2025

క్రికెట్‌కు మిథాలీ రాజ్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Mithali Raj announces retirement from international cricket

క్రికెట్‌కు మిథాలీ రాజ్ గుడ్‌బై
మహిళల క్రికెట్‌పై తనదైన ముద్ర
కెరీర్‌లో ఎన్నో రికార్డులు, ఆమె లోటును పూడ్చడం చాలా కష్టం
న్యూఢిల్లీ: భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు మిథాలీరాజ్ బుధవారం ఓ లేఖను విడుదల చేసింది. ప్రస్తుతం మిథాలీ వన్డే, టెస్టు ఫార్మాట్‌లలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. 1999 జూన్ 26న మిథాలీ రాజ్ భారత్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత 23 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు టీమిండియాలో కొనసాగింది. ఈ క్రమంలో మహిళా క్రికెట్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకొంది. ఇక ఈ ఏడాది మార్చి 27న మిథాలీ రాజ్ తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన మిథాలీ రాజ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 39 ఏళ్ల మిథాలీ రాజ్‌కు చిన్నపటి నుంచే క్రికెట్ అంటే ప్రాణం. తొమ్మిదేళ్ల వయసులో మిథాలీ క్రికెట్‌ను ఆడడం ప్రారంభించింది. ఆరంభంలో తన సోదరుడితో కలిసి మిథాలీ క్రికెట్ ఆడేది. ఇక మిథాలీ రాజ్ జీవితం వర్ధమాన క్రికెటర్లకు ఎంతో ఆదర్శమని చెప్పాలి. సుదీర్ఘ కాలం పాటు సాగిన కెరీర్‌లో మిథాలీ మహిళా క్రికెట్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. మహిళా క్రికెట్‌లో ఇంకెవరికీ సాధ్యం కానీ రికార్డులను మిథాలీ తన పేరిట లిఖించుకుంది.
రికార్డుల రారాణి..
మహిళల క్రికెట్‌లో భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌ది ప్రత్యేక స్థానం. మహిళా క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ క్రికెటర్లలో మిథాలీదే అగ్రస్థానం. 23 ఏళ్ల పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. అయితే మిథాలీ మాత్రం దాన్ని ఆచరణలో చేసి చూపించింది. సుదీర్ఘ కెరీర్‌లో మిథాలీ రాజ్ పలు ప్రపంచ రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెట్ మిథాలీ రాజ్ మాత్రమే. అంతేగాక అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌గా కూడా మిథాలీ రికార్డు సృష్టించింది. తన కెరీర్‌లో మిథాలీ రాజ్ 232 వన్డే మాచ్‌లు ఆడింది. ఇందులో ఏడు శతకాలు, మరో 64 అర్ధ శతకాలను సాధించింది.

ఇదే సమయంలో వన్డేల్లో రికార్డు స్థాయిలో 7805 పరుగులను నమోదు చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగులు, అర్ధ సెంచరీలు, అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా మిథాలీ నిలిచింది. ఇక ఆడిన తొలి వన్డేల్లోనే సెంచరీ సాధించి అరుదౌన రికార్డును నెలకొల్పింది. దీంతో పాటు 89 అంతర్జాతీయ టి20 మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఇందులో 17 అర్ధ సెంచరీలను సాధించింది. టి20 కెరీర్‌లో 2364 పరుగులు చేసింది. మరోవైపు 12 టెస్టుల్లో భారత్ తరఫున బరిలోకి దిగింది. ఆడిన మొదటి టెస్టులోనే డబుల్ సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. టెస్టుల్లో మిథాలీ రాజ్ 699 పరుగులు చేసింది. ఇక మూడు ఫార్మాట్‌లలో కలిపి పది వేలకు పైగా పరుగులు సాధించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. మహిళల క్రికెట్ మరే క్రికెటర్ కూడా ఇలాంటి అరుదైన రికార్డును సాధించలేదు. మరోవైపు కెప్టెన్‌గా కూడా మిథాలీ టీమిండియాపై తనదైన ముద్ర వేసింది. వన్డేల్లో, టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించింది.
అభినందనల వర్షం..
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్‌పై సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిసింది. భారత క్రికెట్‌కు మిథాలీ చేసిన సేవలు కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భారత క్రికెట్ బోర్డు ఈ మేరకు మిథాలీని అభినందిస్తూ ట్వీట్ చేసింది. భారత క్రికెట్ మిథాలీ చేసిన సేవలను గుర్తు చేసుకుది. మహిళా క్రికెట్‌కు మిథాలీ రాజ్ గొప్ప వారసత్వాన్ని మిగిల్చి వెళ్లిందని ప్రశంసించింది. రెండవ ఇన్నింగ్స్ మరితం విజయవంతం కావాలని ఆకాంక్షించింది. బిసిసిఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వసీం జాఫర్, వివిఎస్ లక్ష్మణ్ తదితరులు కూడా మిథాలీని అభినందించారు. ఆమెలాంటి క్రికెటర్ చాలా అరుదుగా లభిస్తారని వారు పేర్కొన్నారు.

Mithali Raj announces retirement from international cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News