అయినా పరుగుల దాహం తీరలేదన్న వెటరన్
లండన్: టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. శనివారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆమె 84 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం ద్వారా అన్ని ఫార్మాట్లలో కలిపి 10,337 పరుగులు చేసింది. ఇంతకు ముందు అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్స్ పేరిట ఉన్న 10, 273 పరుగుల రికార్డును మిథాలి అధిగమించింది. అయితే తనకింకా పరుగుల దాహం తీరలేదని,.. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లోనూ మరింత బాగా ఆడడానికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పింది. మ్యాచ్ అనంతరం వర్చువల్‌లో మిథాలి మీడియాతో మాట్లాడింది.‘ ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఎన్నో ఒడిదొడుకులు..సవాళ్లు. మధ్యలో చాలా సార్లు ఆటకు గుడ్‌బై చెబుతామనుకున్నా. కానీ ఏదో విషయం నన్ను ముందుకు నడిపించింది. దాంతో ఇలా 22 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నా.
అయితే ఇప్పటికీ నాకు పరుగులు చేయాలన్న దాహం తీరలేదు. టీమిండియాకు మరిన్ని విజయాలు అందించాలనుకుంటున్నా. అలాగే నా బ్యాటింగ్‌లోనూ కొన్ని నేర్చుకోవలసినవి ఉన్నాయని తెలుసు. ఇప్పుడు వాటిమీదే దృష్టిపెట్టాను’ అని మిథాలి వివరించింది. ఇక మూడో వన్డేలో తనకు సహకరించిన ఆల్‌రౌండర్ స్నేహ రాణా గురించి మాట్లాడుతూ ఏడో స్థానంలో ఆమెలాంటి క్రికెటర్ కోసమే తాము వేచి చూశామన్నారు. ఆమెతో నెలకొల్పిన అర్ధశతకం భాగస్వామ్యం అత్యంత విలువైనదని చెప్పింది. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్ కోల్పోవడంపై స్పందిస్తూ, ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారని చెప్పింది. కాగా ఇంగ్లండ్‌తో ఆడిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 21తేడాతో కోల్పోయినప్పటికీ మూడో మ్యాచ్‌లో గెలవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేసింది. రాబోయే టి20 సిరీస్‌ను మరింత పట్టుదలతో ఆడడానికి ఈ విజయం స్ఫూర్తి నింపుతుందని చెప్పింది.