లక్నో: భారత సీనియర్ మహిళా క్రికెటర్, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుది. అన్ని ఫార్మాట్‌లలో కలిపి పదివేల పరుగులు సాధించిన రెండో మహిళా క్రికెటర్‌గా మిథాలీ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇంగ్లండ్‌కు చెదిన చార్లెట్ ఎడ్వర్డ్ మాత్రమే ఈ ఘనతను సాధించింది. చార్లెట్ ఎడ్వర్డ్ మూడు ఫార్మాట్‌లలో కలిపి 10,273 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా మిథాలీ రాజ్ కూడా పదివేల పరుగుల మైలురాయిని అందుకుంది. మిథాలీ టెస్టులు, వన్డే, ట్వంటీ20లలో కలిపి ఇప్పటి వరకు 10,001 పరుగులు సాధించింది.
కెరీర్‌లో 10 టెస్టులు ఆడిన మిథాలీ 663 పరుగులు చేసింది. ఇందులో ఒక శతకం, మరో నాలుగు అర్ధ శతకాలున్నాయి. అంతేగాక 212 వన్డేలు ఆడిన మిథాలీ 6,974 పరుగులు చేసింది. ఇందులో ఏడు సెంచరీలు, మరో 54 హాఫ్ సెంచరీలున్నాయి. దీంతోపాటు 89 టి20 మ్యాచ్‌లు ఆడి 2,364 పరుగులు చేసింది. ఇదిలావుండగా మిథాలీ ఇప్పటికే టెస్టు, టి20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం వన్డేలకు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తోంది. రానున్న వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని మిథాలీ ఇప్పటికే స్పష్టం చేసింది.