Wednesday, January 22, 2025

మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

- Advertisement -
- Advertisement -

వెటరన్ నటుడు, ‘మృగయా’, ‘డిస్కో డ్యాన్సర్’, ‘ప్రేమ్ ప్రతిజ్ఞ’ వంటి చిత్రాల స్టార్ మిథున్ చక్రవర్తికి చలనచిత్ర రంగంలో ప్రభుత్వ అత్యున్నత గుర్తింపు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సోమవారం ప్రకటించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఈ అవార్డు ప్రకటన చేశారు. అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యుడైన మిథున్ చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వం మూడవ ఉన్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ ప్రదానం చేసిన కొన్ని నెలల తరువాత తాజా అవార్డు ప్రకటన వచ్చింది. మిథున్ చక్రవర్తిని ప్రధాని నరేంద్ర మోడీ అభినందిస్తూ, ఆ నటుడు అన్ని తరాలు అభిమానించే ‘సాంస్కృతిక దిగ్గజం’ అని అభివర్ణించారు. ‘భారతీయ సినిమాకు సాటిలేని రీతిలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాకర దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మిథున్ చక్రవర్తికి ప్రకటించినందుకు ఆనందిస్తున్నాను. ఆయన తన అద్భుత ప్రదర్శనలతో అన్ని తరాలవారి అభిమానం చూరగొన్న సాంస్కృతిక దిగ్గజం.

ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు’ అని ప్రధాని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. మిథున్ గణనీయ చలనచిత్ర ప్రస్థానం ‘తరతరాలకు స్ఫూర్తిదాయకం’ అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ‘భారతీయ సినిమాకు తన విశిష్ట సేవలకు గాను దిగ్గజ నటుడు మిథున్ చక్రవరికి అవార్డు ప్రదానం చేయాలని దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ నిర్ణయించిందని ప్రకటించే గౌరవం దక్కింది’ అని మంత్రి తన పోస్ట్‌లో తెలిపారు. తనకు ఈ వార్త అందినప్పుడు ఆహారం, ఆశ్రయం కోసం ఆదిలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులతో సహా తన జీవితం తన మదిలో కదలాడసాగిందని 74 ఏళ్ల మిథున్ చక్రవర్తి వెల్లడించారు. ‘నాకు మాటలు రావడం లేదు. గతాన్ని గుర్తు చేసిన సందర్భం ఇది. నేను కోల్‌కతా నుంచి ముంబయి వెళ్లాను. ముంబయిలో నాకు ఆహారం దొరకలేదు. కొన్ని సార్లు తోటలో నిద్రిస్తుండేవాడిని& ఇది పదే పదే కళ్ల ముందు కదలాడసాగింది. ఇదంతా జరిగిన తరువాత ఈ బృహత్ గౌరవం లభించింది. నాకు మాటలు కొరవడుతున్నాయి.

ఈ అవార్డును నా కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు అంకితం చేస్తున్నానని మాత్రమే చెప్పగలను’ అని మిథున్ చక్రవర్తి కోల్‌కతాలో విలేకరులకు తెలిపారు. ‘నాజీవితం ఏమీ సాఫీగా సాగలేదని మీకు తెలుసు. నాకు ఏదీ అప్పనంగా లభించలేదు. ప్రతిదాని కోసం నేను పోరాడవలసి వచ్చింది, అయితే ఈ అవార్డు వంటి ఫలితం వచ్చినప్పుడు మీరు ఆ బాధ అంతా మరచిపోతారు. భగవంతుడు కరుణామయుడు’ అని ఆయన చెప్పారు. మిథున్ చక్రవర్తి ప్రధాని మోడీని కూడా కొనియాడారు. ‘నాకు ప్రధాని మోడీ అంటే అమిత గౌరవం ఉంది, ఆయన అద్భుత వ్యక్తి. నాకు ఆయన గురించి తెలుసు. ఆయన ఒక రత్నం’ అని మిథున్ పేర్కొన్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కూడా వెటరన్ నటుడు మిథున్ చక్రవర్తిని అభినందించారు. ‘మిథున్‌జీ పలు దశాబ్దాల విశిష్ట కెరీర్ మన చిత్రాలను సుసంపన్నం చేయడమే కాకుండా నటనలో ప్రతిభ ప్రమాణాలు నెలకొల్పింది. ఆయనకు నా శుభాకాంక్షలు’ అని అమిత్ షా తెలియజేశారు. మిథున్ చక్రవర్తికి అక్టోబర్ 8న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఉత్సవంలో ప్రదానం చేయనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

దాదాసాహెబ్ అవార్డు పూర్వపు గ్రహీత ఆశా పరేఖ్, నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్, సినీ దర్శకుడు విపుల్ అమృత్‌లాల్ షాతో కూడిన ముగ్గురు సభ్యుల జ్యూరీ ఈ ప్రతిప్ఠాత్మక పురస్కారానికి మిథున్ చక్రవర్తిని ఎంపిక చేసింది. ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ వంటి చిత్రాల్లో మిథున్‌తో కలసి పని చేసిన సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా ’ఎక్స్’ పోస్ట్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అసలు పేరు గౌరంగ్ చక్రవర్తి అయిన మిథున్ చక్రవర్తి పుణెలోని ఫిలిమ్, టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ)లో పూర్వ విద్యార్థి. ఆయన ప్రధానంగా హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించారు. ఆయన తెలుగులో ‘గోపాల గోపాల’ చిత్రంలో కూడా నటించారు. మృణాల్ సేన్ 1976లో తీసిన చిత్రం ‘మృగయా’తో మిథున్ సినీ అరంగేట్రం చేశారు. ఆయన ఆ చిత్రంతోనే ఉత్తమ నటుడుగా తన తొలి జాతీయ సినీ అవార్డు గెలుచుకున్నారు. ఆయన 1992లోని ‘తహదేర్ కథ’ (ఉత్తమ నటుడు)కు, 1997లోని ‘స్వామి వివేకానంద’ (ఉత్తమ సహాయ నటుడు)కు మరి రెండు జాతీయ అవార్డులు పొందారు.

మిథున్ చక్రవర్తి 1982 సూపర్ హిట్ ‘డిస్కో డ్యాన్సర్’లో తన విశిష్ట నృత్య శైలితో బహుల ప్రాచుర్యం పొందారు. అటుపిమ్మట ‘ముఝె ఇన్సాఫ్ చాహియే’, ‘హమ్ సే హై జమానా’, ‘పసంద్ అప్నీ అప్నీ’, ‘ఘర్ ఏక్ మందిర్’, ‘కసమ్ పైదా కర్నే వాలే కీ’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన 1990 నాటి ‘అగ్నీపథ్’లో తన పాత్రకు గాను మిథున్ ప్రశంసలు అందుకున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడైన మిథున్ చక్రవర్తి 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News