హైదరాబాద్ : సిర్పూర్-టీ పోలీసు స్టేషన్ లో కౌటాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బుద్దే స్వామి, సిర్పూర్-టి ఎస్ఐ ఢీకొండ రమేశ్ గురువారం పత్రికా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో సీఐ మాట్లాడుతూ డుర్కె కవిత కడుపులో బిడ్డ మృతికి కారణం ఆమె భర్త, అత్త, మామలే అని వెల్లడించారు. సిర్పూర్ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన డుర్కే కవిత, కోట మహేందర్ ప్రేమించుకున్నారు. కవిత పెళ్ళికి ముందే గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పంచాయతి పెట్టి గత సంవత్సరం ఆగష్టు నెలలో ఇరువురికి వివాహం జరిపించారు.
కాగా వివాహం అయిన వారం రోజుల నుండే కవితకు అత్తవారింట్లో వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్తమామల వేదింపులు తాలలేక కవిత తన పుట్టింటికి వచ్చేసింది. డిసెంబరు 29 న కవిత ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న ఆమె భర్త కోట మహేందర్ తన భార్య కడుపులో ఉన్న బిడ్డను చంపాలనే దురుద్దేశ్యంతోనే తన తల్లిదండ్రుల కోట విమల, కోట లహానుల సహాయంతో కూల్ డ్రింక్స్(మజా) లో పురుగుల మందు కలిపి తాగించారు.
మజా త్రాగిన కొద్ది సేపటికే కవిత రక్తం కక్కుకొని కింద పడిపోగా ఆమె బందువులు చూసి కవితను చికిత్స నిమిత్తం కాగజ్ నగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిష్తితి విషమించడంతో అక్కడి నుండి మంచిర్యాల్ కు తీసుకొని వెళ్ళి మెడిలైఫ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తుండగా తేదీ: 30. 12. 2022 రోజున కవిత ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యం బాగా లేనందున మంచిర్యాల్ లో చికిత్స చేస్తుండగా బిడ్డ మృతి చెందింది. కవిత ఆరోగ్యం కూడా విషమంగా ఉండడంతో కవిత తండ్రి డుర్కే పెంటు జనవరి 1వ తేదిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిత భర్త కోట మహేందర్, అత్తమామ కోట విమల, కోట లహానులు పై కేసు నమోదు చేసి గురువారం వారిని రిమాండ్ కు పంపడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో సిర్పూర్-టి ఎస్ఐ ఢీకొండ రమేశ్ సిబ్బంది పాల్గొన్నారు