సగానికి పైగా ఆటోలు రోడ్డు మీదనే
పరీక్షల సమయంలో బంద్‌లు సరికాదంటున్న
విద్యార్థుల తల్లిదండ్రులు
హైదరాబాద్: కేంద్రం ప్రభుత్వం తెచ్చిన రహదారి భద్రత చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని,ఫిట్ నెస్ చార్జీల పేరుతో విధించే జరిమానాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ఆటో, క్యాబ్స్ , లారీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. సగానికి పైగా ఆటోలు రోడ్ల మీద కనిపించాయి. ఈ బంద్‌ను ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించి విరమించు కోవడమే కాకుండా బుధవారం అర్థరాత్రి నుంచి బంద్ అనే అంశాన్ని నాయకులు కార్మికులకు ముందస్తు తెలియచేయడంతో ఇటువంటి పరిస్థితి వచ్చినట్లు సమాచారం. గతంలో ఆటో కార్మికుల సమస్యలపై బంద్‌కు పిలిపు ఇస్తే అన్ని వర్గాల నుంచి మంచి స్పందన రావడమే కాకుండా ప్రభుత్వం కూడా దిగి వచ్చి వారి సమస్యల పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేసింది.ఏది మైనప్పటికి ఆటో కార్మికుల సమస్యలపై అన్నివర్గాలు ఒకే తాటి మీద నిలబడక పోవడంతో ఇటువంటి పరిస్థితి తెలెత్తింది. ఏ ఉద్యమానికైనా,పోరాటానికి కైనా ప్రజల మద్దతు ఎంతో అవసరం కాని. ఆటోల బంద్‌కు ప్రజల మద్దతు ఏ మాత్రం లభించడం లేదు.
ప్రయాణికుల నుంచి ఇష్టం వచ్చిన విధంగా వసూలు చేయడం, కొద్ది పాటి దూరానికి కూడా మీటర్ వేయకుండా రూ. 50 నుంచి 100 వసూలు చేయడమే తదితర అంశాలు కూడా దీనిపై బంద్‌పై ప్రభావం చూపాయి. ఏది ఏమైనప్పటికి ఆటో యూనియన్ నాయకులు ఇటుంటి అంశాలపై దృష్టి పెట్టి ఆటో డ్రైవర్లకు సరైన మార్గదర్శకం చేయడంలో జేఏసీ నాయకులు విఫలం కావడంతో వారు నిర్వహించిన బంద్‌కు అంతగా స్పందన లభించలేదు. అంతే కాకుండా ప్రస్తుతం నగరంలో ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు ఎంబిఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో జేఏసీ నాయకులు బంద్ నిర్వహించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంద్‌లు నిర్వహించేందుకు ఇదే సరైన సమయం కాదంటున్నారు.
బంద్‌సాకుతో నిలువు దోపిడి: కొంత మండి ఆటోడ్రైవర్లు బంద్ సాకుతో దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను, అదే విధంగా పరీక్షలకు వెళ్ళే విద్యార్థులను, ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయిన పేషంటన్లు నిలువుదోపడికి గురి చేశారు. కిలో మీటర్ దూరం కూడా లేని ప్రాంతాలకు రావాలన్నా రూ.150 నుంచి 200 వసూలు చేశారని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.