Tuesday, September 17, 2024

టీకాల మిక్సింగ్‌తో మరింత బలం

- Advertisement -
- Advertisement -

Mixing of Covishield and Covaxin safe: ICMR study

టీకాల మిక్స్ డోసులతో మరింత బలం
ఐసిఎంఆర్ తొలి రౌండ్ పరీక్షలో వెల్లడి
వేరియంట్లపై దెబ్బకు ఇదే మందు

న్యూఢిల్లీ:  కొవిషీల్డ్, కొవాగ్జిన్ వేర్వేరు డోసులుగా తీసుకున్న వారిలో అత్యధిక రోగనిరోధక శక్తి ఏర్పడుతోంది. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) అధ్యయనంలో కనుగొన్నారు. సాధారణంగా ఇప్పటివరకూ ఏదో ఒక టీకాను రెండు డోసులుగా తీసుకునే పద్ధతి ఉంది. అయితే ఓ డోసులో కొవిషీల్డ్, మరో డోసుగా కొవాగ్జిన్ పొందిన 98 మందిలో యాంటీబాడీల ఉత్పత్తి క్రమం గురించి ఐసిఎంఆర్ అధ్యయనం నిర్వహించింది. ఓ డోసుగా ఓ వ్యాక్సిన్, మరో డోసుగా ఇంకో టీకా ఒకే వ్యక్తికి వేయడం అనేది వ్యాక్సిన్ మిక్సింగ్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 18 మంది తెలిసో తెలియకో వేర్వేరు డోసులు తీసుకోవడం జరిగింది. ఈ మిక్స్ వ్యాక్సిన్లు పొందిన వారిలో ఇమ్యూనిటీ పరిస్థితి గురించి కూడా అధ్యయనం జరిపారు. ఈ క్రమంలో వారిలో ఇతరులతో పోలిస్తే అత్యధిక రోగనిరోధకత ఏర్పడిందని కనుగొన్నారు. నిజానికి ఒకే రకం వ్యాక్సిన్లు తీసుకున్న వారితో పోలిస్తే వీరిలోనే ఇమ్యూనిటి పాలు ఎక్కువగా ఉందని తేల్చారు.

ఇక వ్యాక్సిన్ల వల్ల తలెత్తే అవలక్షణాల విషయానికి వస్తే ఒకే రకం టీకాల పద్థతిలో తలెత్తే నామమాత్రపు అవలక్షణాలే వీరిలో ఉన్నాయి. అంతకు మించి ప్రతికూలత లేదని వెల్లడైంది. వేర్వేరు రకాల టీకాల విధానంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే అస్ట్రాజెనెకా, ఫైజర్‌పై పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. మరోవైపు ఇక్కడ ఇండియాలో కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లపై అధ్యయనాలు చేపట్టారు. దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లకు సంబంధించి ప్రజలలో కొంత మేరకు అయోమయం నెలకొంది. రెండింటి పేర్లలో సారూప్యత ఉండటం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పెద్దగా చదువుకోని వారికి టీకాల గురించి ఎక్కువగా తెలియకపోవడం వంటి పరిణామాలతో ఇటీవల యుపి ఇతర ప్రాంతాలలో వేర్వేరు డోసులలో వేర్వేరు టీకాలు తీసుకున్నారు.

అయితే ఈ పరిణామం వల్ల నష్టం లేదని, ఇటువంటి మిక్సింగ్ డోసు వ్యాక్సినేషన్ వల్ల రోగనిరోధకత మరింత పెరుగుతోందనే ఫలితం వెలువడటంతో ఇకపై వ్యాక్సినేషన్ల పద్ధతిపై దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అయితే వేర్వేరు ఉత్పత్తి సంస్థలు ఓ విధంగా పోటీ పడుతూ రూపొందించే టీకాల వాడకంపై సమగ్రత అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియచేస్తూ వస్తోంది. మిక్సింగ్, మ్యాచింగ్ పద్ధతుల్లోరెండు వేర్వేరు డోసుల వాడకం వల్ల మంచి జరుగుతుందా? చెడు ఉంటుందా? అనేది ఇప్పటికీ పరిశోధనల స్థాయిలోనే ఉందని, దీనిని ఎక్కువగా ఆచరణలోకి తీసుకురావడం కుదరదని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌లో అనేక రకాల వేరియంట్లు వస్తూ ఉండటంతో వీటి తీవ్రతను దెబ్బతీయడానికి మిక్స్ వ్యాక్సిన్ తీసుకోవడం అత్యుత్తమ మార్గమని నిపుణులు అంచనా వేశారు. అయితే ఈ కోణంలో అధ్యయనాలు పూర్తి స్థాయిలో నిర్థారణ అయితే తప్ప ఈ దిశలో ముందడుగు మంచిదికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News