Sunday, December 22, 2024

మిజోరంలో కొత్త గాలి!

- Advertisement -
- Advertisement -

ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్‌పిఎం) సాధించిన విశేష విజయం ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షను పుష్కలంగా ప్రతిబింబిస్తున్నది. మిజో జాతీయ వాదంపై అతిగా ఆధారపడి పోటీ చేసిన పాలక ఎంఎన్‌ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్) ను ప్రజలు ఓడించారు. 40 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో 27 జడ్‌పిఎం ఖాతాలో పడ్డాయి. ఎంఎన్‌ఎఫ్ కేవలం 10 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అందులో 9 గ్రామీణ ప్రాంతాలవే. ఎంఎన్‌ఎఫ్ ప్రస్తుతం కేంద్రంలోని పాలక ఎన్‌డిఎ కూటమిలో భాగంగా వున్నది. ఇక్కడ 1989 నుంచి అంటే మిజోరం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, ఎంఎన్‌ఎఫ్‌ల మధ్యనే అధికారం చేతులు మారుతూ వచ్చింది.

1987లో మిజోరం రాష్ట్రం అవతరించింది. ఎంఎన్‌ఎఫ్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు భావించారు. మార్పు తీసుకొస్తానని, మంచి పరిపాలన అందిస్తానని వాగ్దానం చేసి జెడ్‌పిఎం వారి ఆదరాభిమానాలను చూరగొన్నది. జాతుల సంక్షోభంతో అట్టుడికిపోతున్న మణిపూర్ సరిహద్దుల్లో మిజోరం వుంది. ఇంకొక వైపు మయన్మార్, బంగ్లాదేశ్‌లు కూడా దాని సరిహద్దుల్లో వున్నాయి. ఈ మూడు వైపుల నుంచి శరణార్థుల తాకిడి మిజోరంకు అధికంగా వుంది. జడ్‌పిఎం అభివృద్ధి నినాదం నగర ప్రాంతాల ఓటర్లను బాగా ఆకర్షించినట్టు అర్థమవుతున్నది. ఎంఎన్‌ఎఫ్ గెలుచుకొన్న పది స్థానాల్లో తొమ్మిది గ్రామీణ ప్రాంతాల్లో వుండగా, ఒకటి మాత్రమే పట్టణ ప్రాంతాలకు చెందినది కావడం గమనార్హం.

2018 ఎన్నికల్లో 14 పట్టణ ప్రాంత సీట్లను ఎంఎన్‌ఎఫ్ గెలుచుకోగా, ఈసారి ఒక్క స్థానంలోనే విజయం సాధించగలిగింది. నిరుద్యోగాన్ని, పేదరికాన్ని అరికట్టడంలో ఎంఎన్‌ఎఫ్ వైఫల్యం దాని విజయావకాశాలను దెబ్బ తీసింది. జెడ్‌పిఎం గెలుపు ఎంఎన్‌ఎఫ్‌కు, బిజెపికి కూడా పరాభవమే. అలాగే కాంగ్రెస్ సైతం చిత్తుగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకొన్న కాంగ్రెస్ ఈసారి ఒకటితో సంతృప్తి చెందవలసి వచ్చింది. బిజెపి గత ఎన్నికల్లో ఒక చోటనే గెలవగా, ఈసారి రెండు స్థానాలు సాధించుకొన్నది. రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రెండు సార్లు ప్రచారానికి వెళ్ళినా కాంగ్రెస్‌కు అది ప్రయోజనం కలిగించలేదు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడే పరాజయం పాలయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి ఎంఎన్‌ఎఫ్ అధినేత జోరాంతంగా తన సొంత ఐజాల్ స్థానంలోనే ఓడిపోయారు.

జెడ్‌పిఎం అధినేత లాల్‌దుహోమా మాజీ ఐపిఎస్ అధికారి. ఈయన 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భద్రతా వ్యవహారాల ఇన్‌చార్జిగా పని చేశారు. మణిపూర్‌లో మెయితీలకు, కుకీలకు ఘర్షణలు చెలరేగిన తర్వాత తలెత్తిన సంక్షోభం నుంచి మిజోరంలో జాతీయ భావాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని ఎంఎన్‌ఎఫ్ ఆశించింది. గ్రేటర్ మిజోరం డిమాండ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. జో తెగకు చెందిన కుకీ, చిన్, జోమి, మిజో ఉప తెగల ప్రజల తరపున వకాల్తా పుచ్చుకోడం ఈ ఎన్నికల్లో తనకు లాభిస్తుందని ఎంఎన్‌ఎఫ్ ఆశించి అందులో విఫలమైంది. మణిపూర్‌లో సంక్షోభం ముదిరిన తర్వాత అక్కడి నుంచి కుకీ తెగ వారు భారీ సంఖ్యలో మిజోరంకు రావడం ప్రారంభించారు.

అలాగే బంగ్లాదేశ్ నుంచి కూడా వెల్లువెత్తారు. వారికి దన్నుగా వుంటున్నాననే అతి విశ్వాసంతో ఈ ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ పోటీ చేసింది. అయితే దానికి చెందిన 11 మంది మంత్రుల్లో 9 మంది ఓటమి పాలు కావడం మిజో ప్రజలు ఏమి కోరుకొంటున్నారో తేటతెల్లం చేసింది. ఇది బిజెపికి కూడా హెచ్చరిక వంటి ఫలితమే. ఎందుకంటే మిజో ప్రజలు ఎటువంటి సెంటిమెంట్లకు విలువ ఇవ్వకుండా తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. విచిత్రంగా లాల్‌దుహోమా పార్టీఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం కోల్పోయిన మొట్టమొదటి ఎంపి, ఎంఎల్‌ఎ. అయినా ఆయన నాయకత్వాన్ని మిజోరం వరించింది.

రాష్ట్రానికి అవసరమైన వనరుల సమీకరణకు ప్రత్కేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని, పొదుపు చర్యలు తీసుకొంటామని, పెట్టుబడుల ఉపసంహరణకు ప్రాధాన్యమిస్తామని, మానవ వనరులపై వాస్తవ గణాంకాలు సేకరిస్తామని లాల్‌దుహోమా వాగ్దానం చేశారు. ఇది అక్కడి ప్రజలను ఆకట్టుకొన్నది. అయితే కేంద్ర పాలక కూటమి ఎన్‌డిఎకు ఎంఎన్‌ఎఫ్‌కు మధ్య గల బంధం లాల్‌దుహోమా చేతులను కట్టివేసే ప్రమాదం లేకపోలేదు. సున్నితమైన ఈశాన్య రాష్ట్రంతో బిజెపి స్వప్రయోజన కుతంత్రాలు మితిమించితే బెడిసికొట్టే ప్రమాదమున్నది. ఇప్పటికే మణిపూర్‌లో రగిలిన చిచ్చు 8 మాసాలైనా ఆరడం లేదు. అందుచేత మిజో ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ జెడ్‌పిఎం ప్రభుత్వానికి కేంద్రంలోని బిజెపి పాలకులు సహకరిస్తారని ఆశించవచ్చు. మార్పును కోరుకొనే ప్రజలను నిరుత్సాహ పరచడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News