Monday, January 20, 2025

మిజోలో పగ్గాలు మార్చిన జనం..

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్ : ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. మిజోలో మార్పు కోరుకున్నారు. రాష్ట్రంలో జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్ (జడ్‌పిఎం)కు పట్టం కట్టారు. ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న మిజోనేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) ఓటమి పాలయ్యింది. 40 అసెంబ్లీ స్థానాల మిజోరంలో జెడ్‌పిఎంకు 27 స్థానాలు దక్కాయి. పార్టీ సిఎం అభ్యర్థి లాల్దూహోమా విజేతల్లో కీలకంగా ఉన్నారు. సెర్చిప్ స్థానం నుంచి తమ సమీప ప్రత్యర్థి, ఎంఎన్‌ఎఫ్‌కు చెందిన మలస్వాజులా వంచావ్వంగ్‌ను 2982 ఓట్ల తేడాతో ఓడించారు. అధికారంలో ఉన్న ఎంఎన్‌ఎఫ్ తొమ్మిది స్థానాలను పొందింది. మరో స్థానంలో ఆధిక్యతలో ఉంది. బిజెపి పలాక్, సైహా స్థానాలలో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం దక్కించుకుంది. అధికార పార్టీలోని పలువురు ప్రముఖులు పరాజితులు అయ్యారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంఎన్‌ఎఫ్ అధ్యక్షులు జోరాంథంగా ఓడారు. పలు కీలక స్థానాలు , ప్రత్యేకించి ఐజ్వాల్‌లో జెపిఎం విజయం సాధించింది.

ఆదివారం ఇతర మూడు రాష్ట్రాలతో కలిసి కౌంటింగ్ జరగాల్సిన మిజోలో ఈ ప్రక్రియ సోమవారానికి వాయిదా పడింది. క్రిస్టియన్ వర్గాల నిరసనలతో దీనిని నిలిపివేసి సోమవారం చేపట్టారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ఆరంభమైంది. 13 కేంద్రాలలో లెక్కింపు చేపట్టారు. కొన్ని స్థానాలలో అతి తక్కువ మంది ఓటర్లు ఉండటంతో కేవలం రెండు రౌండ్లలోనే లెక్కింపు పూర్తయింది. ఎక్కువ స్థానాలలో ఐదు రౌండ్లలో కౌంటింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. గోవాలో ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని దాదాపు 8.57 లక్షల మంది ఓటర్లలో 80 శాతానికి పైగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికలలో ఎంఎన్‌ఎఫ్, జడ్‌పిఎం, కాంగ్రెస్‌లు మొత్తం 40 స్థానాలకు పోటీ చేశాయి. బిజెపి 23 స్థానాలలో అభ్యర్థులను దింపింది. ఆమ్ ఆద్మీపార్టీ తొలిసారిగా ఇక్కడ బరిలోకి దిగింది. నాలుగు స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టారు. ఈసారి ఎన్నికల్లో 17 మంది ఇండిపెండెంట్లు కూడా రంగంలోకి దిగారు.

ఎవ్వరీ లాల్దూహోమా
ఒకప్పుడు ఇందిరాగాంధీ సంరక్షకుడు
గోవాలో ఎన్నికల ఫలితాలతో సంచలనం సృష్టించి సిఎం కానున్న లాల్దూహోమా పలు ప్రత్యేకతలు సంతరించుకున్నారు. 73 సంవత్సరాల ఈ కాబోయే సిఎం రాజకీయ జీవితం ఎక్కువగా ప్రతిబంధకాలను అధిగమించడంతో సాగింది. దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలో తొలిసారిగా అనర్హత వేటుపడ్డ ఎంపిగా ఆయన పేరు రికార్డులలో నిలిచింది. మాజీ ఐపిఎస్ అధికారి అయిన లాల్దూహోమా ఓ దశలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి భద్రతా వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్నారు. 2019లోనే ఆయన జడ్‌పిఎంను రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించారు. కొద్దికాలంలోనే ఇప్పుడు గోవాలో అధికారం చలాయించే పార్టీగా దీనిని బలోపేతం చేశారు. మూడు దశాబ్దాలుగా మిజోరంలో ముఖ్యమంత్రి పదవి గురించి ఇద్దరు రాజకీయ నాయకులు లాల్ లాల్దూహోమా, ఎంఎన్‌ఎఫ్ నేత జోరాంథంగా మధ్యనే సాగుతూ వస్తోంది.

లాల్దూహోమా తొలుత 1984లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేశారు. కానీ ఓడారు. తరువాత అదే ఏడాది ఆయన కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. ఏకగ్రీవంగా గెలిచారు. తరువాత 1988లో పార్టీ వీడటంతో ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలో వేటు పడింది. ఈ విధంగా ఆయన దేశంలో అనర్హతకు గురైన తొలి ఎంపి అయ్యారు. ఇటీవలి కాలంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ నాయకుడి పేరు ప్రస్తావనకు వస్తోంది. ఐపిఎస్ హోదాలోఆయన ఇందిరా గాంధీకి వ్యక్తిగత రక్షణ బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఆమె నుంచి ప్రత్యేక ప్రశంసలు పొందారు. కాంగ్రెస్‌లోకి రావడానికి ఈ డ్యూటీ ఉపకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News