Saturday, November 23, 2024

కరోనా సంక్లిష్ట దశ ఇదే

- Advertisement -
- Advertisement -
Mizoram is state of concern Says Dr VK Paul
వచ్చే రెండు నెలలే కీలకం
పండుగల సీజన్‌లో థర్డ్‌వేవ్ గండం?
ఈ దశ దాటితే వైరస్ తగ్గుముఖమే
టాస్క్‌ఫోర్స్ సభ్యులు వికె పాల్

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్‌కు సంబంధించి అక్టోబర్, నవంబర్ నెలలే అత్యంత కీలకం కానున్నాయి. పండుగల నెలలు, జనసమ్మేళనంతో వైరస్ తిరిగి విజృంభించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యులు, కోవిడ్ సంబంధిత జాతీయ టాస్క్‌ఫోర్స్ (కెటిఎఫ్ ) సంచాలకులు అయిన డాక్టర్ వికె పాల్ గురువారం తెలిపారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి గురించి ఆయన వివరించారు. కేరళలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే ఇప్పటికీ దేశంలో అత్యధిక కేసులు కేరళలోనే ఉన్నాయి. దేశవ్యాప్త కేసులలో కేరళనే ఇప్పటికీ దాదాపు 68 శాతంతో ఉంది. ఇప్పుడు అక్కడ కేసులు తగ్గుముఖం పట్టడం ఇక ముందు ఇదే విధంగా కొనసాగుతుందా? అనేది తెలియాల్సి ఉంది. కేరళలో వైరస్ ఇప్పుడు నిలకడగా ఉంది. దేశంలో కేసుల పరిస్థితి చూస్తే మిజోరం ఆందోళనకర సంకేతాలు వెలువరిస్తోందని డాక్టర్ పాల్ తెలిపారు.

దేశవ్యాప్తంగా సగటున వైరస్ వ్యాప్తి కట్టడిలోకి వచ్చింది. అయితే అక్టోబర్ , నవంబర్‌లలో వచ్చే పండుగలు, ఈ సందర్భంగా జరిగే జనసమ్మర్థ ఘట్టాలతో వైరస్ తిరిగి పుంజుకుని తీవ్రస్థాయిలో వ్యాపించే అవకాశాలు లేకపోలేదని, ఈ విధంగా వైరస్‌కు ఈ రెండు నెలలు అత్యంత అనువైన వాతావరణంగా మారుతాయని విశ్లేషించారు. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాలలో మతపరమైన ఉత్సవాలు ఇప్పుడు జరుగుతున్న గణేష్ వేడుకలతో జనం ఒకేచోట కిక్కిరిసి ఉండటం, మాస్క్‌ల విషయంలో నిర్లక్షం, మరో వైపు అనేక ప్రాంతాలలో ఆంక్షల తొలిగింపు లేదా సడలింపులు జరగడంతో ఇప్పటికీ దేశానికి థర్డ్‌వేవ్ ముప్పు ఉంది. వచ్చే రెండు నెలల్లో వైరస్ వ్యాప్తికి మనకు మనమే అవకాశం కల్పించుకునే పరిస్థితి ఉండటంతో ఈ దశలో థర్డ్‌వేవ్ ముప్పు ఉందని పాల్ తెలిపారు. ఈ దశలో వైరస్ తీవ్రత తక్కువగా ఉంటే ధర్డ్‌వేవ్‌కు అవకాశాలు తగ్గుతాయని వివరించారు. దేశంలో ఇప్పుడు కేరళలో 1.99 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక తరువాతి క్రమంలో మిజోరం, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో మొత్తం పదివేల యాక్టివ్ కేసులు ఉన్నాయని గురువారం ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కేరళ, ఇతర రాష్ట్రాలలో కూడా ఇకపై వైరస్ తగ్గుముఖం పడుతుందని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. పండుగల నెలలు వైరస్ వ్యాప్తికి దారితీసే నెలలు అవుతాయనే అభిప్రాయంతో భార్గవ్ ఏకీభవించారు.

బూస్టర్ ఉండదు ..రెండు డోస్‌ల పద్ధతే

దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి ఇప్పుడున్న రెండు డోస్‌ల పద్ధతి కొనసాగుతుందని, బూస్టర్ షాట్స్‌కు దిగే ఆలోచన లేదని కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ సంబంధిత విషయాలలో కీలక మార్పు ఏదీ ఉండదని ఇప్పటి విధానమే సాగుతుందని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ భార్గవ తెలిపారు. వ్యాక్సిన్లపై సెంట్రల్ థీమ్‌లో మార్పేమీ లేదన్నారు. ప్రజలు వ్యాక్సిన్లను తీసుకోవడం, కోవిడ్ నియమావళిని పాటిస్తూ సరైన విధంగా వ్యవహరించడం కీలకం, ప్రయాణాలు, ఉత్సవాల దశలో పండుగలలో బాధ్యతాయుతంగా ఉండాలని కేంద్రం తరఫున డాక్టర్ భార్గవ్ తెలిపారు. శాస్త్రీయ, ప్రజా ఆరోగ్య సంరక్షణ బృందాల వారి సమీక్షా సమావేశాలలో, సమీక్షలలో బూస్టర్ డోస్‌ల ప్రస్తావన రాలేదు. దీనిపై ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News