Friday, March 21, 2025

జాతీయ ఉద్యమంగా మారిన పునర్విభజన .. వీడియో షేర్ చేసిన స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం లోని బీజేపీకి, పలు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు పలు రాష్ట్రాల నాయకులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మార్చి 22 న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముందు స్టాలిన్ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు.

జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్ , పంజాబ్ నాయకులకు నా హృదయ పూర్వక స్వాగతం . మార్చి 5న జరిగిన అఖిలపక్ష సమావేశం ఒకమైలు రాయి. 2026 ఏడాదిలో జరిగే పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే పార్లమెంటులో మన ప్రాతినిధ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది కేవలం ఎంపీల సంఖ్య గురించి మాత్రమే కాదు, రాష్ట్ర హక్కుల భంగం గురించి. అందుకే దీనిపై బీజేపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ ఏకమయ్యాయి. తమిళనాడు లోని 58 పార్టీలు సైతం విభేదాలను పక్కనపెట్టి సముచితమైన పునర్విభజనకు ఒక్కటయ్యాయి. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను తొలుత తమిళనాడు వ్యతిరేకించింది.

దీనికి అన్ని రాష్ట్రాలు చేతులు కలపడంతో ప్రస్తుతం ఇది ఒక జాతీయ ఉద్యమంగా మారింది. ” అని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా శనివారం జరిగే సమావేశం దేశ భవిష్యత్తును రూపొందించే ఉద్యమానికి నాంది అని ఆయన అభివర్ణించారు. ఈ నెల 5 న స్టాలిన్ నేతృత్వం లో చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అందులో పునర్విభజనను వ్యతిరేకిస్తున్నట్టు అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. పార్లమెంట్ సభ్యుల సంఖ్యను పెంచే పక్షంలో 1971 జనాభా లెక్కల ఆధారంగా ఇరు సభల్లో రాష్ట్రాల మధ్య ప్రస్తుతమున్న నిష్పత్తి మేరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో పునర్విభజన వల్ల జరిగే నష్టాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించేందుకు కలిసి రావాలని ఏడు రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖలు రాశారు. ఈ నెల 22న చెన్నైలో నిర్వహించే సమావేశానికి ప్రతినిధులను పంపాలని ఆయన అందులో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News