తమిళనాడు రాజకీయాలు అనూహ్యంగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇందుకు అద్దం పడుతోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కరుప్ప పళనిస్వామిపైన, రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు అన్నాసలైపైన ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారంనాడు పరువు నష్టం దావా వేశారు. తనకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించినందుకు వారిపై స్టాలిన్ కేసు వేశారు. మాదకద్రవ్యాల కేసులో డిఎంకె మాజీ నేత జాఫర్ సాదిక్ ఇటీవల అరెస్టయిన నేపథ్యంలో స్టాలిన్ కు కూడా మత్తుమందుల ముఠాతో సంబంధాలు ఉన్నాయంటూ పళనిస్వామి, అన్నామలై ఆరోపణలు చేశారు. వారు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ స్టాలిన్ కేసు దాఖలు చేశారు.
మత్తుమందుల వాడకాన్ని, సరఫరాను అరికట్టేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కూడా ఈ సందర్భంగా స్టాలిన్ వివరించారు. సాక్ష్యాల ఆధారంగా చేసే నిర్మాణాత్మకమైన ఆరోపణలకు తామెప్పుడూ వ్యతిరేకం కాదనీ, అయితే మాదక ద్రవ్యాల ముఠాలతో తనకు సంబంధం ఉందంటూ తన ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయడం సహించరానిదని స్టాలిన్ పేర్కొన్నారు. జాఫర్ సిద్దిక్, స్టాలిన్ కలసి ఉన్న ఫోటోలను పళనిస్వామి ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేయడంపై డిఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.