అమిత్ షా హిందీ భాష తంతుతో సమాఖ్యకు చేటు
ప్రధాని మోడీకి తమిళనాడు సిఎం స్టాలిన్ లేఖ
కేంద్రీయ విద్యాసంస్థలలో మాధ్యమ మార్పుపై నిరసన
నెహ్రూ హామీని తీసి గట్టున పెట్టొద్దని సూచన
విచెన్నై: హిందీ భాషను బలవంతంగా దక్షిణాదిపై రుద్దాలనే కేంద్ర యోచన పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అంశంపై ఆదివారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. కేంద్రీయ విద్యాలయాలలో హిందీని బోధనాభాషగా చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు వెలువరించిందనే వార్తలపై స్టాలిన్ స్పందించారు. ఇది మంచి ఆలోచన కాదని తెలిపారు. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్న పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ప్రాంతీయ భాషలలో చదువుకునే విద్యార్థులకు చేటుగా మారుతాయని తెలిపారు. ఐఐటిలు, ఐఐఎంఎస్‌ఉ, ఎఐఐఎంఎస్ వంటి విద్యాసంస్థలలో హిందీని నిర్బంధ బోధనాభాషగా చేయాలని షా కమిటీ సూచించింది. అదే విధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో కూడా ఆంగ్లం స్థానంలో హిందీని ప్రవేశపెడుతారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాలు, టెక్నికల్ నాన్ టెక్నికల్ విద్యాసంస్థలలో కూడా హిందీనే అధికారిక మాధ్యమం అయ్యేలా పార్లమెంటరీ కమిటీ సిఫార్సుకు దిగిందనే విషయాన్ని స్టాలిన్ ఈ లేఖలో ప్రస్తావించారు. అన్నింటికి మించి కేవలం హిందీ మీడియంలో చదవిన యువతకే కొన్ని రకాల ఉద్యోగాలలో అర్హతలను కల్పించనున్నారు. రిక్రూట్‌మెంట్ల పరీక్షలలో ఇంగ్లీషును తప్పనిసరి ప్రశ్నాపత్రం జాబితా నుంచి తీసివేశారని, ఈ మేరకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు వెలువడ్డాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా రాజ్యాంగంలోని సమాఖ్య విధానాలకు విఘాతం, దేశ బహుభాషల సమ్మిళిత వ్యవస్థకు హానీ కల్గిస్తాయని విమర్శించారు. రాజ్యాంగ ఎనిమిదవ షెడ్యూల్‌లో తమిళం సహా 22 భాషలను పొందుపర్చారు. ఈ పట్టికలో మరిన్ని భాషలను చేర్చాలనే డిమాండ్లు వెలువడుతున్నాయి. భారత సమాఖ్యలో హిందీ మాట్లాడే వారితో పోలిస్తే ఇతర భాషలలో మాట్లాడే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రధాని మోడీ ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని వ్యవహరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా భాషా సూత్రీకరణపై దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రదర్శించిన సామరస్య ధోరణిని ప్రస్తావించారు. హిందీయేతర ప్రజలు తమంతతాముగా కోరుకునే వరకూ ఇంగ్లీషే అధికారిక భాషల్లో ఒకటిగా ఉంటుందని చెప్పారని, దీనికి అనుగుణంగానే 1968, 1976లలో అధికార భాషలపై తీర్మానాలు వెలువరించారని గుర్తు చేశారు. తరువాత రూపొందించిన నిబంధనల మేరకు ఇంగ్లీషు, హిందీ రెండింటిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, సేవల విభాగాలలో వాడాలని నిర్ణయించారని తెలిపారు. ఈ వైఖరి ఒక్కటే అధికార భాషలపై అన్ని రకాల చర్చలకు మైలురాయి అవుతుందని స్పష్టం చేశారు.
MK Stalin Letter to PM Modi over Hindi Language