7న తమిళనాడు సిఎంగా ప్రమాణం
చెన్నై: డిఎంకె శాసనసభాపక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ బుధవారం రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీ, కీలక నాయకుడు, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌తో కలసి గవర్నర్‌ను కలుసుకున్న స్టాలిన్ డిఎంకె శాసనసభా పక్ష నాయకునిగా తన ఎన్నికకు సంబంధించిన లేఖను అందచేసి తమిళనాడు శాసనసభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న తమ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
మే 7వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకె స్టాలిన్ పదవీ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాజభవన్లో నిరాడంబరంగా జరిగే కార్యక్రమంలో స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. డిఎంకె శాసనసభా పక్ష నాయకునిగా స్టాలిన్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 234 స్థానాలు గల తమిళనాడు అసెంబ్లీలో డిఎంకె సొంతంగా 133 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌తోసహ ఇతర మిత్రపక్షాలతో కలుపుకుని డిఎంకె కూటమి బలం 159 ఉంది. కాగా, ఈ ఎన్నికల్లో ఎఐఎడిఎంకె 66 స్థానాలు గెలుచుకోగా దాని మిత్రపక్షాలైన బిజెపికి 4, పిఎంకెకి 5 స్థానాలు దక్కాయి.