Wednesday, January 22, 2025

ఇంతకూ ప్రధానిది ప్రతిపక్షమా?

- Advertisement -
- Advertisement -

543 సీట్లూ తనవే అంటాడు
తమిళనాడు సిఎం స్టాలిన్
స్పెయిన్ నుంచి తిరిగిరాక

చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తానో ప్రతిపక్ష నేతను అనే ధోరణిలో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చెప్పారు. విదేశీ పర్యటనను ముగించుకుని సిఎం స్టాలిన్ బుధవారం స్వరాష్ట్రం చేరుకున్నారు. స్పెయిన్ నుంచి తిరిగి రాగానే బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో విదేశీ పెట్టుబడుల రప్పింతకు ఆయన పలు దేశాల పర్యటన తలపెట్టారు. పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని ఈ దశలో స్టాలిన్ ప్రస్తావించారు. తాను టీవీలలో ఈ ప్రసంగాన్ని చూశానని, చదివాను, ఆనందించి నవ్వుకున్నానని వివరించారు.

ఆయన తరచూ ఓ ప్రతిపక్ష నేత భావనతో , కాంగ్రెస్ అధికార పక్షం అనే చిత్రీకరణతో మాట్లాడటం తనకు విచిత్రం అన్పించిందని స్టాలిన్ చెప్పారు. ప్రధాని వైఖరి తనకు ఫజిల్ అయిందని, ఇప్పుడిప్పుడే దీని వెనుక ఆంతర్యం గురించి ఆలోచించడం జరుగుతోందని తెలిపారు. ఇప్పుడే కాదు , ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పది సంవత్సరాలుగా అదేపనిగా కాంగ్రెస్‌ను తిడుతున్నాడు. తాను అధికారపక్షంలో ఉండి , ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం మానేసి ఎదురుదాడికి దిగడం విచిత్రం అని స్టాలిన్ తెలిపారు.

ఇది మోడీ మార్క్ రాజకీయం అనుకోవల్సి వస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎకు 400కు పైగా సీట్లు వస్తాయని ఏకంగా లోక్‌సభలోనే మోడీ చెప్పడంపై స్టాలిన్ స్పందించారు. ఈ మాటలకు తాను ఆశ్చర్యపోవడం లేదని, చివరికి మొత్తం 543 స్థానాలూ తమవే అని ఆయన చెప్పినా చెపుతారని , ఎవరూ అవాక్కు కావాల్సిన పనిలేదని చమత్కరించారు. మొత్తం సీట్లు బిజెపి, మిత్రపక్షాలకు వస్తాయనేది ఆయన ధీమా అయి ఉండవచ్చు. దీనిని ఎవరూ కాదనాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

స్పెయిన్ పర్యటన ఫలప్రదం
రూ 3440 కోట్ల మేర పెట్టుబడులు
తమిళనాడులో విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు తాను జరిపిన పర్యటన సత్ఫలితాలదిశలో ఉందని స్టాలిన్ తెలిపారు. దాదాపు రూ 3440 కోట్ల మేర కీలక రంగాలలో పెట్టుబడులకు అవకాశం ఏర్పడిందని తెలిపిన స్టాలిన్ ప్రత్యేకించి స్పెయిన్ నుంచి స్పందన చాలా చాలా బాగుందని, తమిళనాడును దేశంలోని పారిశ్రామిక రంగంలో అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లే రీతిలో అక్కడి నుంచి వచ్చే పెట్టుబడులు ఉపయుక్తం అవుతాయని వివరించారు. ఇక నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై స్పందిస్తూ ప్రజాసేవకు ఎవరు ముందుకు వచ్చినా సంతోషమే అన్నారు. గత నెల 27వ తేదీన స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. బుధవారం ఉదయం తిరిగి ఇక్కడికి చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News