చెన్నై : హిందీ కారణంగా 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగై పోతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు గురువారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. “ ఇతర రాష్ట్రాల సోదర సోదరీమణులారా .. హిందీ కారణంగా ఎన్ని భారతీయ భాషలు కనుమరుగయ్యాయో , ఎప్పుడైనా ఆలోచించారా ? 100 ఏళ్లలో ఉత్తర భారతంలో 25 భాషలు కనుమరుగయ్యాయి. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢ్, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురు చూస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్, బీహార్‌లు, హిందీ రాష్ట్రాలు కావు, వాటి అసలు భాషలు గతంలో కలసిపోయాయి. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం. జాతి సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారు. ” అని స్టాలిన్ రాసుకొచ్చారు. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తాము ద్విభాషా సూత్రానికి కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డిఎంకే ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.