Friday, November 22, 2024

స్టాలిన్ పాలన

- Advertisement -
- Advertisement -

MK Stalin's rule in Tamilnadu

 

తమిళనాడు ముఖ్యమంత్రిగా శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన ముత్తువెలి కరుణానిధి స్టాలిన్ (ఎంకె స్టాలిన్) పాలన ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అంతటా గూడు కట్టుకోడం సహజం. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వారసుడిగానే కాకుండా ఆయన రాజకీయ వారసుడిగా కూడా స్టాలిన్ నిలదొక్కుకున్నాడని ఆయన సాధించుకున్న ఈ ఎన్నికల విజయం చాటుతున్నది. కరుణానిధి లేని డిఎంకెకి ఆయన స్థాయిలోనే సమర్థుడైన నేతగా గత లోక్‌సభ ఎన్నికలలో, ఇప్పటి అసెంబ్లీ ఎన్నికలలోనూ పార్టీని ఎదురులేని విజయ తీరాలకు చేర్చి నిర్దంద్వంగా నిరూపించుకున్నారు. తమిళ భాషను, ద్రవిడ సంస్కృతిని రక్షించే పరమ లక్షానికి ప్రాధాన్యతనిస్తున్న ఏకైక రాజకీయ పక్షంగా డిఎంకెకి ఉన్న ప్రత్యేకత రీత్యా స్టాలిన్ ప్రభుత్వం కీలక సందర్భాలలో తీసుకునే నిర్ణయాలను మిగతా దేశం శ్రద్ధగా గమనిస్తుంది. 33 మంది మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలు జనహిత దృష్టిని చాటుకున్నాయి.

రాష్ట్రంలోని మొత్తం 2.07 కోట్ల మంది రేషన్ కార్డుదారులందరికీ రూ. 4000 నగదు సహాయం విడుదలకు సంబంధించిన ఫైలుపై స్టాలిన్ మొదటి సంతకం చేశారు. ఇందులో సగాన్ని (రూ. 2000) తొలి విడతగా చెల్లిస్తారు. ప్రైవేటు ఆసుపత్రులలో కొవిడ్ రోగులు చేయించుకునే చికిత్స ఖర్చులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం కింద భరించాలని తీసుకున్న నిర్ణయం రాష్ట్రాన్ని కరోనా సెకండ్ వేవ్ పట్టిపీడిస్తున్న నేపథ్యంలో అమిత ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్డినరీ సిటీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. ఆవిన్ (ప్రభత్వ సంస్థ) పాల ధరను లీటర్ వద్ద రూ. 3 తగ్గించారు. మొన్నటి ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నింటినీ మొదటి వంద రోజుల్లో నెరవేర్చడానికి నిర్ణయించి అందుకు ప్రత్యేకంగా ఒక శాఖను నెలకొల్పారు. 1999లో కేంద్రంలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వంలో చేరి 2003 డిసెంబర్ వరకు కొనసాగిన చరిత్ర ఉన్నప్పటికీ తమిళుల ప్రత్యేక గుర్తింపును కాపాడడమే ధ్యేయంగా పని చేస్తున్న ఒకే ఒక్క పార్టీగా డిఎంకె ఇప్పటికీ పరిగణన పొందుతున్నది.

పదేళ్ల పాటు తమిళనాడును పాలించిన ఎఐఎడిఎంకెను వరుసగా మూడో సారి అధికారంలోకి తీసుకురాడానికి కేంద్రంలోని బిజెపి పాలకులు పన్నిన వ్యూహాలన్నిటినీ ఈ అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడు ఓటర్లు భగ్నం చేశారు. 234 స్థానాలున్న శాసన సభలో డిఎంకె ఒక్క దానికే 133 స్థానాలతో స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టారు. దాని నాయకత్వంలోని (డిఎంకె, కాంగ్రెస్, విసికె, ఉభయ వామపక్షాలు) సెక్యులర్ ప్రగతి శీల కూటమికి (ఎస్‌పిఎ) 159 స్థానాలను ఇచ్చారు. ఆ విధంగా తమిళనాడులో ద్రవిడేతర పార్టీలకు చోటు లేదని ప్రకటించి అక్కడ పాగా వేయడానికి బిజెపి చేసిన ప్రత్యక్ష, పరోక్ష ప్రయత్నాలను తిప్పికొట్టారు. స్టాలిన్ శుక్రవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను ద్రవిడ రాజకీయాలకు చెందిన వాడినని తన ట్విట్టర్ ఉపోద్ఘాతంలో ప్రకటించడం గమనించవలసిన విషయం.

డిఎంకె వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై 1962లో పార్లమెంటులో చేసిన తన ప్రప్రథమ ప్రసంగంలో ఇవే మాటలతో తన గురించి చెప్పుకున్నారు. వాటినే డిఎంకె ఇప్పటికీ శిరోధార్యంగా పరిగణిస్తున్నది.2019 లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులోని మొత్తం 38 స్థానాలలో ఒక్కటి తప్ప మిగతా అన్నింటినీ (37) డిఎంకె కూటమి గెలుచుకున్నది. ఆ వెంటనే స్టాలిన్ తన పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో ఇండియా అంటే హిందీ మాట్లాడే రాష్ట్రాలే అనుకునే రోజులు పోయాయని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలనే గెలిపించిన సంగతిని కూడా ఆ లేఖలో స్టాలిన్ ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికలకు నెల రోజుల ముందు పెరియార్ రామస్వామి జన్మస్థలమైన ఈరోడ్‌లో మీడియా గోష్టిలో మాట్లాడినప్పుడు కూడా స్టాలిన్ ద్రవిడనాడును గురించి బాహాటంగా ప్రస్తావించారు. అప్పుడు ఈరోడ్ లోక్‌సభ స్థానం నుంచి డిఎంకె అభ్యర్థి అన్నాడిఎంకె అభ్యర్థిపై రెండు లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

స్టాలిన్ హయాంలో అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రయోగించే హిందుత్వ వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో లేక పూర్తిగా విఫలమొందుతాయో అన్నది ఆసక్తికరమైన అంశం. మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి కూడా ఒక విధమైన మంచి పాలన అందించారనే పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కేంద్రంలోని బిజెపి పాలకుల నుంచి మద్దతు పుష్కలంగా లభించింది. అందుకు పూర్తి భిన్నమైన నేపథ్యంలో అధికారాన్ని స్వీకరించిన స్టాలిన్ పరిపాలనను సమర్థవంతంగా నిరూపించుకోడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. అభివృద్ధి, ఆదర్శాలు అనే అ, ఆ లను ప్రభావవంతంగా ప్రజాజీవనంలో ప్రతిఫలింప చేయడానికి స్టాలిన్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News