Sunday, September 8, 2024

కారు దిగిన మరో ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్‌కు మరో దెబ్బ తగిలింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ ఇంటికి వెళ్లిన ఆయన సిఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బిఆర్‌ఎస్ నుంచి హస్తం పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ‘కారు’ దిగి హస్తం గూటికి చేరగా, తాజాగా ఆ పార్టీకి చెందిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేతో కలిపి కాంగ్రెస్‌లో చేరిన వారిలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్‌లు ఉన్నారు.

నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరా
పార్టీలో చేరిన అనంతరం ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఆయన నివాసంలో మాట్లాడుతూ నియోజక అభివృద్ధి కోసం, సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌లో చేరానని అరికెపూడి అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఎంతగానో అభివృద్ధి చేశామని ఆయన ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్లై ఓవర్లు, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని సిఎం హామీ ఇచ్చారన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతామని, నియోజకవర్గ అభివృద్ధి కోసం సిఎంను నిధులు కోరారని దానికి సిఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన వివరించారు.

కాంగ్రెస్‌లో చేరిన 9 మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వివరాలు ఇలా…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News