హైదరాబాద్ : బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, బండి సంజయ్ భాష ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో లేదు, పంట నష్టం పై బండి వ్యాఖ్యలు అర్థరహితం, హాస్యాస్పదంగా ఉన్నాయని ఆర్‌టిసి చైర్మన్-, ఎంఎల్‌ఎ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి వ్యాఖ్యలు దొంగే దొంగ అన్న ట్టుగా ఉన్నాయన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేస్తున్నారో చెప్పి ఇక్కడ మాట్లాడాలి. సిఎం కెసిఆర్ ఫీల్డ్‌కు వెళ్లడం లేదంటున్న బండికి కండ్లు, చెవులు లేవా, కెసిఆర్ ఖమ్మం వెళ్లి పంట నష్టం చూడలేదా, కెసిఆర్ వెళ్లొచ్చిన తర్వాత పంట నష్టానికి సంబంధించి 151 కోట్ల రూపాయలను హరీష్ రావు మొన్ననే విడుదల చేశారన్నారు.
వాట్సాప్ యూనివర్సిటీల్లో అబద్దాలు ప్రచారం చేస్తూ బిజెపి పబ్బం గడుపుతోందని విమర్శించారు. రైతులకు కెసిఆర్ ఇప్పటివరకు 4.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారన్నారు. మోడీ రైతులకు ఏం చేస్తున్నారో బండి ప్రశ్నించాలని తెలిపారు. బండికి తెలివి ఉంటే రైతులకు అదనంగా మరో పది వేలు ఇప్పించాలన్నారు. రైతుల గురించి బిజెపికి మాట్లాడే హక్కు లేదన్నారు. బిజెపికి వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్ప ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. బిజెపి అబద్దాలు మాట్లాడి ఎన్ని రోజులు బతుకుతుందని ప్రశ్నిం చారు. దేశ ప్రజలు బిజెపికి శిక్ష విధించడం ఖాయమన్నారు. ఎంపి గుండు అరవింద్ కూడా నయా పైసా కు పనికి రాడని, అబద్దాలు తప్ప అరవింద్‌కు ఏం రావని విమర్శించారు.
ఎకరాకు 30 వేలు డిమాండ్ చేయడం కాదు బండి సంజయ్ కు చేతనైతే కేంద్రం నుంచి పది వేలు ఇప్పించాలన్నారు. తెలంగాణలో బిజెపి నేతలు తప్ప ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. బిజెపి అబద్దాలు మోసాలు ప్రతి ఊరులో ఎండగడుతామన్నారు. కెసిఆర్ సచివాలయం కడితే తప్పు, మోడీ పార్లమెంటు కడితే ఒప్పా, బిజెపి నేతల తీరు చూసి ప్రజలు ఛీ కొడుతున్నా రన్నారు. బండి సంజయ్‌కు పిచ్చి లేచింది, తక్షణమే పిచ్చి ఆస్పత్రి లో చేర్పించాలని బాజి రెడ్డి గోవర్ధన్ సూచించారు.