Friday, November 15, 2024

ప్రగతి భవన్ ఔన్నత్యం బండికి తెలియదు

- Advertisement -
- Advertisement -

MLA Balka Suman Comments on MP Bandi Sanjay

అది కేవలం ఒక భవనం కాదు… సకల జనుల సంక్షేమ భవన్
వంట గదిని… మంటగదిగా మార్చిన కేంద్రం
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను తుంగలొతొక్కింది
వీటిపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడం లేదు
టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికిన ప్రభుత్వ విప్ బాల్కసుమన్

హైదరాబాద్ : ప్రగతి భవన్ ఒక భవనం కాదని… అది సకల జనుల సంక్షేమ భవన్ అని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలకు పురుడు పోసిన భవన్ అని అభివర్ణించారు. అలాంటి ప్రగతి భవన్ ఔన్నత్యం గురించి తెలియకనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు సిఎం కెసిఆర్ అభిమానులేనని అన్నారు. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా టిఆర్‌ఎస్ పాలన కొనసాగుతోందన్నారు. తెలంగాణ ప్రజలు బికారులు అన్న మాటలను సంజయ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. సిఎంకు బండి రాసిన లేఖలో అంతా విషమే కాని… విషయం లేదని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ వంటగదిని…మంట గదిగా మార్చిందని బాల్కసుమన్ విమర్శించారు. వంటనూనెలు, గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయని ఆరోపించారు. పెరిగిన ధరలు రాష్ట్ర బిజెపి నేతలకు కనిపించడం లేదా? లేక కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం లేదా? అని నిలదీశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై అనవసరపు విమర్శలు మానుకుని రాష్ట్రానికిచ్చిన కేంద్రం హామీల అమలుపై ప్రశ్నించాలన్నారు.

మంగళవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఎంఎల్‌సి శంభీపూర్ రాజు, ఎంఎల్‌ఎ నన్నపనేని నరేందర్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కసుమన్ మాట్లాడుతూ, బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. దేశంలో అన్ని అమ్మేయడంలో కేంద్రంలోని మోదీ సర్కారు విజయం సాధిస్తోందన్నారు. అభివృద్ధి వార్షిక సగటు రేటు దేశంతో పోలిస్తే తెలంగాణదే ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిని జిడిపి లెక్కలే చెబుతాయన్నారు. కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రాన్ని పచ్చగా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో పండించిన దొడ్డు వడ్లను కేంద్రం కొననంటున్నదని, దీనిపై తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నలుగురు బిజెపి ఎంపిలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పేరుతో రాష్ట్రంలోని రైల్వే ఆస్తులను లీజుకిచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ పాదయాత్రలు, ప్రభుత్వాలకు లేఖలు, టిఆర్‌ఎస్‌పై విమర్శలను మానుకుని కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన విషయాలపై దృష్టి సారించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వీటిపై దృష్టి సారించకుండా కేవలం టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని
విమర్శించి ప్రజల్లో పలచనయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు అని హితవు పలికారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తే రైతులు ఊరుకోరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్కగా ఉందని పార్లమెంట్‌లో ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్రమే సమాధానం ఇచ్చిందని విషయాన్ని ఈ సందర్భంగా బాల్కసుమన్ గుర్తు చేశారు. వినాయక నిమజ్జనం ముగిసిందని…ఇక ప్రతిపక్షాల నిమజ్జనం మిగిలి ఉందన్నారు. ఆ బాధ్యత ప్రజలు తీసుకుంటారన్నారు.

హుజురాబాద్‌లో కారుదే గెలుపు

హుజురాబాద్లో వందకు వంద శాతం టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడని బాల్కసుమన్ ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ అంటే నమ్మకం…బిజెపి అంటే అమ్మకమని అని ఆయన పేర్కొన్నారు. హుజురాబాద్‌లో జరిగే ఎన్నిక అబద్ధాల కమలానికి, అభివృద్ధి చేసిన కారు గుర్తుకు మధ్య జరుగుతున్న సంగ్రామం అని ఆయన అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News