Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ఘర్‌వాపసీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌లోనే కొనసాగనున్నట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే ఆయన (జూలై 6వ తేదీన) కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన ఆయన తాజాగా మంగళవారం కెటిఆర్‌తో సమావేశమై పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం తాను తన సొంతపార్టీ అయిన బిఆర్‌ఎస్‌లోనే కొనసాగనున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కెసిఆర్ ఛాంబర్‌లోకి గద్వాల ఎమ్మెల్యే వెళ్లారు. అక్కడ ఉన్న గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తనకు కెసిఆర్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కెటిఆర్‌ను గద్వాల ఎమ్మెల్యే కోరినట్లుగా తెలిసింది. తాను బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేనేని గులాబీ పార్టీలోనే కొనసాగనున్నట్లు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే కెసిఆర్‌ను కలుస్తానని ఆయన అన్నారు.

స్థానిక నేతలు వ్యతిరేకించినా…
జూలై 6వ తేదీన కాంగ్రెస్‌లో ఆయన చేరికను స్థానిక గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు. ఆయన్ను చేర్చుకోవద్దని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ శ్రేణులకు సిఎం రేవంత్ సర్దిచెప్పారు. పైగా గద్వాల కాంగ్రెస్ నాయకులతో సమావేశమై వారికి నచ్చజెప్పి అనంతరం ఆయన్ను హస్తం పార్టీలో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన గద్వాల బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఒక్కసారిగా హస్తం పార్టీకి షాక్ ఇస్తూ బిఆర్‌ఎస్‌లో కొనసాగనున్నట్లు మంగళవారం ప్రకటించారు.
హాట్‌టాపిక్‌గా మారిన…
కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’తో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటుండగా గద్వాల బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మళ్లీ బిఆర్‌ఎస్‌లోనే ఉన్నానని ప్రకటించడం కాంగ్రెస్‌లో అలజడి నెలకొంది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో మొత్తం పది మంది ఎమ్మెల్యేలు చేరగా ప్రస్తుతం కృష్ణ మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడంతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరినట్టే.

కెటిఆర్‌ను కలిసిన తెల్లం
ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు పార్టీని వీడి వెళ్లిన మిగతా ఎమ్మెల్యేలను సైతం తిరిగి రప్పించే ప్రయత్నాలను బిఆర్‌ఎస్ ముమ్మరం చేసింది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సైతం మళ్లీ బిఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం తెల్లం వెంకట్రావ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కలిశారు. అనంతరం కెటిఆర్‌తో భేటీ అయ్యారు. ఈ రెండు రోజుల్లో ఆయన కూడా బిఆర్‌ఎస్‌లోకి వెళతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్ గూటికి రావడానికి చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరిన వారిలో అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం, డాక్టర్ సంజయ్, కాలేరు యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలు ఉండగా ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఆషాఢం తరువాత బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి…
ఆషాఢమాసం అయిపోయిన తరువాత సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే చాలా మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని హస్తం పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు చేరిన వారితో పాటు మరో పది మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని, బిఆర్‌ఎస్‌కు విపక్ష హోదా ఉండని కాంగ్రెస్ నేతలు పేర్కొనడం విశేషం.
నేను పార్టీ మారడం లేదు: ఎమ్మెల్యే కాలె యాదయ్య
పార్టీ మార్పు వార్తలపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన క్లారిటీ ఇచ్చారు. తిరిగి బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నానని జరుగుతోన్న ప్రచారమంతా అవాస్తమని ఆయన కొట్టిపారేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫొటో తీసి పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారు: తెల్లం వెంకట్రావ్
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ విలేకరులతో చిట్‌చాట్ చేస్తూ బిఆర్‌ఎస్‌లో కొందరు అల్ప సంతోషులు ఉన్నారని తన ఫొటో తీసి పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రుల చాంబర్‌లకు వచ్చి కలుస్తున్నారని, వారంతా పార్టీ మారేవారేనా?పార్టీ మారే అవసరం తనకు లేదని, కాంగ్రెస్‌తోనే తన ప్రయాణమని ఆయన తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News