Friday, November 22, 2024

ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్‌లోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదు
అలక బూనిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని
బుజ్జగించిన ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని, మళ్లీ బిఆర్‌ఎస్‌లోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై అలక బూనిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు బుజ్జగించారు.

గురువారం ఉదయం గద్వాల కృష్ణమోహన్ రెడ్డికి ఇంటికి జూపల్లి వెళ్లి కలిశారు. ఆయనతో పాటు మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే గౌని మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి వెంట వెళ్లారు. జూలై 6 వ తేదీన సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి అదే నెల 30 న అసెంబ్లీ వద్ద కెటిఆర్‌ను కలవడంతో కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది.

బిఆర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌కు ఉందని వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో మాట్లాడాలని సిఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. సిఎం సూచన మేరకు గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని మంత్రి జూపల్లి కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా తనకు ప్రధాన్యత లభించడం లేదని, గద్వాల కాంగ్రెస్ నాయకురాలు సరితకు ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వడంలేదని ఎమ్మెల్యే జూపల్లితో ఆయన వాపోయినట్లుగా తెలిసింది. ఇటీవల కల్వకుర్తిలో సిఎం సభకు సరితను ఆహ్వానించారని, తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్న విషయం జూపల్లి దృష్టికి ఆయన తీసుకెళ్లినట్లు సమాచారం. గద్వాల నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలపై హామీ ఇవ్వలేదని ఎమ్మెల్యే అనడంతో ఇక నుంచి అంతా మంచి జరుగుతుందని మంత్రి భరోసా ఇచ్చారు.

పాత పరిచయంతోనే కెటిఆర్‌ను కలిశారు…
ఎమ్మెల్యే బండ్ల బిఆర్‌ఎస్‌లోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, మొన్న అసెంబ్లీలో కెటిఆర్, ఇతర బిఆర్‌ఎస్ నేతలతో పాత పరిచయంతోనే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కలిశారని, అంతా మాత్రానికే కాంగ్రెస్‌ను వీడుతున్నారన్న మాటలు వచ్చాయని ఈ సందర్భంగా జూపల్లి పేర్కొన్నారు. గద్వాల నియోజకవర్గం అభివృద్ధి కోసం సిఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తారని, గట్టు ఎత్తిపోతల పథకంతో పాటు నియోజకవర్గం పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సిఎం కృతనిశ్చయంతో ఉన్నారని జూపల్లి వెల్లడించారు. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి ఎవ్వరూ వెళ్లడం లేదని, ఇదంతా బిఆర్‌ఎస్ నేతలు సృష్టిస్తున్న పుకార్లు అని జూపల్లి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి వచ్చిన వారికి న్యాయం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అనంతరం అందరూ కలిసి కృష్ణ మోహన్ రెడ్డి ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News