Wednesday, January 22, 2025

కొల్లాపూర్‌లో హోరాహోరీ

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌ఎ బీరం, మాజీ
మంత్రి జూపల్లి హౌస్
అరెస్టు ఇరువర్గాల
మోహరింపు

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి/కొల్లాపూర్ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య 15 రోజుల క్రితం విసురుకున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు.. చివరకు చర్చ సాగకుండానే.. ఎవరి అవినీతిని ఎవరూ బయట పెట్టుకోకుండానే మిగిసింది. వారం రోజులుగా టెన్షన్ టెన్షన్‌గా సాగిన కొల్లాపూర్ రాజకీయం కాస్తా.. ఇరువర్గాల కార్యకర్తలు హడావుడి.. నేతలు హౌస్ అరెస్టులతో సద్దుమనిగింది. ఎమ్మెల్యే బీరం, మాజీ మంత్రి జూపల్లిపై అవినీతి ఆరోపణలు సంధించిన విషయం విధితమే. పోలీసులు చర్చకు అనుమతి లేదన్నా కూడా ఇద్దరు నేతలు కొల్లపూర్‌కు శనివారమే వచ్చి చర్చకు సిద్ధమంటూ ప్రకటనలు చేశారు. దీంతో ఇద్దరు నేతల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. తన ఇంటికే వస్తానని ఎంఎల్‌ఎ సవాల్‌ను స్వీకరిస్తున్నామని మాజీ మంత్రి మీడియా ముందుకు వచ్చి అనడంతో రాజకీయం కాస్త వేడెక్కింది. ఇరువురి నాయకులు అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో కొల్లాపూర్ తరలివచ్చారు. వారంతపు సంత కావడంతో కొల్లాపూర్‌లో పట్టణ ప్రజలు, ఇరువురి నేతల కార్యకర్తలు అభిమానులతో పెద్దఎత్తున రావడంతో కోలాహలంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.

మూడున్నర ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో జరిగిన అవినీతి, కుంటుపడిన అభివృద్ధిపై ఆరోపణలు సంధిస్తూ బహిరంగచర్చకు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సిద్ధమని జూపల్లి సవాల్ విసిరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చ పెడితే ఆ మహాత్ముని ఆత్మ క్షోభిస్తుందని.. జూపల్లి ఇంటికే బహిరంగ చర్చకు వస్తానని ప్రతి సవాల్ విసిరారు. దీనికి ఇరువురు నాయకులు 26వ తేదీని ఖరారు చేసి కొల్లాపూర్ నియోజకవర్గంలో టెన్షన్‌కు తెరలేపారు. 15 రోజులపాటు ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. ఇరువర్గాల నాయకులు ఒకచోటికి చేరితే దాడులు, ఘర్షణలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుందని భావించిన జిల్లా అధికార యంత్రాంగం పోలీస్ శాఖ ద్వారా కొల్లాపూర్‌లో నిషేదాజ్ఞలు అమలు చేసినా ఇరువర్గాలు జనసమీకరణతో బలబలాలను ప్రదర్శించేందుకే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతుంది. జిల్లా ఎస్పి కె.మనోహర్ సారథ్యంలో పోలీసులు కొల్లాపూర్‌లో భారీ బందోబస్తును నిర్వహించారు. రాత్రి నుంచే ఇరువురు నాయకుల ఇళ్ల వద్ద పోలీసులను మొహరించారు. తెల్లవారుజాము నుంచే ఎంఎల్‌ఎ బీరం, మాజీ మంత్రి జూపల్లిలను ఇళ్ల నుంచి బయటికిరాకుండా హౌస్ అరెస్ట్ చేశారు.

కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడంతో పట్టణంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా కన్పించింది. అనుకూల, ప్రతీకూల నినాదాలతో కొల్లాపూర్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే తరుణంలో ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్‌రెడ్డి పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ జూపల్లి నివాసానికి వెళ్లడానికి బయటికి వచ్చిన వెంటనే అరెస్టు చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తాను 12గంటల వరకు వేచిచూస్తానని మీడియాకి చెప్పిన దరిమిలా.. బీరంను పోలీసులు అరెస్ట్‌చేసి తీసుకెళ్ళడంతో.. ఉద్దేశ పూర్వకంగానే బీరం అరెస్టు నాటకమాడి పలాయనం చిత్తగించారని సమావేశంలో ఆరోపించారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి చర్చకు వస్తే అవినీతి ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని, అదే మాటకు కట్టుబడి ఉన్నానని జూపల్లి అన్నారు.

తాను అప్పు చేసానే తప్ప.. తప్పు చేయలేదని తీసుకున్న ప్రతి పైసా బ్యాంకులకు చెల్లించి నో డ్యూ పత్రాలను తీసుకున్నానని జూపల్లి అన్నారు. ఏది ఏమైనా కొల్లాపూర్ నియోజకవర్గంలో నాయకుల మధ్య అవినీతి ఆరోపణలు రచ్చకెక్కడం చర్చకు దారితీయగా సవాళ్లు, ప్రతి సవాళ్లే తప్ప.. ఎవరి అవినీతి ఎవ్వరూ బయటపెట్టుకోలేదనే చర్చ సర్వత్రా సాగుతోంది. పోలీసుల నిషేదాజ్ఞలు, 144 సెక్షన్ వంటివి పట్టించుకోకుండానే ఇరువర్గాల కార్యకర్తలు కొల్లాపూర్‌కు పోటెత్తారు. నాలుగు రోజులుగా 26వ తేదీన ఎవ్వరు కొల్లాపూర్‌కు రావద్దని ఐదుగురికి మించి గుమికూడితే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చేసిన హెచ్చరికలు బేఖాతరు అయ్యాయి. పోలీసుల ముందస్తు ప్రణాళికతో ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంవల్ల హై టెన్షన్‌కు తెర పడిందని చెప్పవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News