గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకీ షాక్ తగిలింది. ప్రస్తుతం దేశం మొత్తం రామనామం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్య రామమందిరంపై కాంగ్రెస్ తీరు నచ్చకపోవడంతో ఆ పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా చేశారు. జనవరి 22న ఆయోధ్య ఆలయంలో బాలరాముడి విగ్రహానకి ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు దేశవిదేశాల నుంచి వివిఐపిలు హాజరుకానున్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని భావిస్తోంది. అయోధ్య రామమందిరం ఇంకా పూర్తి కాలేదని.. కానీ, కేవలం రాజకీయ లబ్దీ కోసమే ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దేశంలో మరికొద్దిరోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓట్ల దండుకోవడానికి బిజెపి.. శ్రీరాముడి ఆలయాన్ని వాడుకుంటోందని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే, రామమందిరంపై కాంగ్రెస్ అదిష్టానం వైఖరి తనకు నచ్చలేదని పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే సీజే చావ్దా రాజీనమా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీమానా చేశారు. అనంతరం తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించారు.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండటంతో దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, వేడుక జరుపుకుంటున్నారని.. కానీ, కాంగ్రెస్ దూరంగా ఉండడం తనకు నచ్చలేదని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలో ఆయన బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది.