హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాక్యలు చేశారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కెటిఆర్ పై ఎసిబి, ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. దానం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని అన్నారు. కానీ, అవినీతి జరగలేదని చెప్పలేనని అన్నారు. తాను ఏది మాట్లాడినా సంచలనం అవుతుందని.. తానేమీ కెటిఆర్ కు కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదని చెప్పారు.
తాను ఫైటర్‌నని.. ఉప ఎన్నిక వచ్చినా భయపడనని దానం ధీమా వ్యక్తం చేశారు. హైడ్రాపై కూడా తన వ్యాఖ్యల్లో మార్పు లేదని, దానిపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని సూచించారు. మూసీపై బీజేపీ నేతలు ఒక్క రోజు నిద్ర చేశారని.. అయితే, ముందే ఏసీలు పెట్టించుకుని వెళ్లారని విమర్శించారు. నిర్వాసితుల ఇళ్లలో కాకుండా.. బయట నుంచి తెచ్చిన టిఫిన్ కిషన్‌రెడ్డి తిన్నారని.. కంటితుడుపుగా బీజేపీ నేతలు మూసీ నిద్ర చేశారని ఎమ్మెల్యే దానం మండిపడ్డారు.