మన తెలంగాణ/హిమాయత్‌నగర్ : జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధి నందగిరిహిల్స్ హూడా లేఔట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇస్తానని ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ హెచ్చరించారు. జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (హైడ్రా) కమిషనర్ ఏవి రంగనాథ్‌ను ఉద్ధేశించి ఆయన ఘాటు వాఖ్యలు చేశారు. రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టంలేనట్లుగా ఉందని, అందుకే తనపై కేసు పెట్టాడని, అధికారులు వస్తుంటారు, పోతుంటారని కానీ తాను లోకల్ అని దానం నాగేందర్ అన్నారు. మంగళవారం హిమాయత్‌నగర్, అవంతి నగర్‌లో స్థానిక కార్పొరేటర్‌తో కలిసి కోటి పది లక్షల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందగిరి హిల్స్ హూడా లే ఔట్‌లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తాను అక్కడికి వెళ్ళాలని, జరిగిన విషయాన్ని కూడా రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు.
కారంచెడులో దళితులపై జరిగిన దాడుల మాదిరిగా ఇక్కడ కొందరు సొసైటీ వ్యక్తులు గిరిజనులను బెదిరిస్తున్నారని, హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరమని, అన్ని వర్గాల ప్రజల సమస్యలు, సౌకర్యాలు తీర్చడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతని పేర్కొన్నారు. ఈ ఘటనపై సిఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలో ఎక్కడికైన వెళ్ళే హక్కు ఉందని,తనను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదని ఆయన మండిపడ్డారు. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించినందుకు తనపై కేసులు పెట్టారని, ఈ కేసులు తనకు కొత్తేమి కాదని, తనపై ఇంక ఎన్ని కేసులు పెట్టినా నియోజకవర్గ ప్రజల పక్షాన ఉంటానని తెలిపారు. తనను 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించింది అధికారులు కాదని, నా నియోజకవర్గం ప్రజలేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.