Friday, January 24, 2025

బిజెపితో షర్మిల చీకటి ఒప్పందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు షర్మిల తెలంగాణలో ఉంటూ మోడికి ఏజెంటుగా పనిచేస్తోందని శాసనమండలి సభ్యులు రాజేశ్వర్ రావు, శాసన సభ్యులు ఎల్విన్ స్టీఫెన్‌లు ఆరోపించారు. గురువారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బిజెపితో షర్మిల చీకటి ఒప్పందం చేసుకుందని ధ్వజమెత్తారు. బిజెపితో కలిసి తెలంగాణ రాష్ట్రంలో అల్లకల్లోలం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు.

షర్మిల పాదయాత్రకు బిజెపి జనాలను సమీకరిస్తోందని అన్నారు. నర్సంపేట ఘటనపై షర్మిల డ్రామా చేస్తోందని ఈ ఘటనను రాజకీయం చేస్తోందని, ఆమె మాట్లాడేవన్నీ అబద్దాలేనని వారన్నారు. వైఎస్‌ఆర్ బిడ్డనని చెప్పుకునే అర్హత షర్మిలకు లేదని అన్నారు. వైఎస్‌ఆర్ తన జీవితాంతం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాడారని, అదే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లతో షర్మిల చేతులు కలిపిందని ధ్వజమెత్తారు. షర్మిల చెప్పేది వైఎస్ ఎజెండా, అమలు చేసేది బిజెపి ఎజెండా అని దుయ్యబట్టారు.

మోడి ప్రభుత్వం వేలాది మైనారిటీ సంస్థలను మూసివేసిందని, అలాంటి మోడి ప్రభుత్వంతో చేతులు కలుపుతోందని, మోడి క్రైస్తవులకు వ్యతిరేకి అని వారన్నారు.మోడి దేశంలో మైనార్టీలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. కెసిఆర్ పాలనపై షర్మిల అడ్డగోలు విమర్శలు చేస్తోందని, మైనారిటీలు కెసిఆర్ పాలనలో సురక్షితంగా ఉన్నారని అన్నారు. అన్ని మతాలను కెసిఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని తెలిపారు.

కెసిఆర్‌ను విమర్శించే హక్కు షర్మిలకు లేదన్నారు. కెసిఆర్ ఎజెండా దేశమంతా అమలు కావాలంటే బిఆర్‌ఎస్ రావాలన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లపై రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను మోడి ప్రభుత్వం వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలు శాంతియుతంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో శాంతి ఉన్నందునే అభివృద్ధి జరుగుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News