Sunday, January 19, 2025

తాండూరులో కారు చిచ్చు: ఫైలెట్ వర్సెస్ పట్నం

- Advertisement -
- Advertisement -

తాండూరు : తాండూరులో కారు పార్టీలో వర్గపోరు తగ్గడం లేదు. రోజు రోజుకు బిఆర్‌ఎస్ పార్టీలో వర్గం పోరు ఎక్కువైపోతుంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి మద్య పచ్చగడ్డివస్తే బగ్గుమంటోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రయివేటు కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఎడమొఖం పెడమొఖం పెట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవంలో కూడా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఒక మండలంలో, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఒక మండలంలో పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గం నాయకులు తీవ్ర పోటీ పట్టారు. అప్పట్లో ఛైర్‌పర్సన్ స్వప్న పరిమల్, వైస్ ఛైర్‌పర్సన్ దీపానర్సింలు ఇద్దరు ఛైర్‌పర్సన్ సీటుకోసం పోటీ పడిన విషయం తెలిసిందే.

పరిస్థితులను అదిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కరికి రెండున్నర సంవత్సరాలు మున్సిపల్ ఛైర్‌ఫర్సన్ పదవిని కట్టబెడతామని రాష్ట్ర నాయకులు హామీ ఇచ్చారు. ఆ తరువాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గంలో అనుకూలమైన వారికి దేవాలయాల ఛైర్మన్ పదవులు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవులు కట్టబెట్టారు. మునుగోడు ఎన్నికల సమయం నుంచి సిఎం కేసిఆర్‌కు ఫైలెట్ దగ్గరయ్యారు. తాండూరు నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించుకున్నారు. అదే విధంగా మహబూబ్‌నగర్ నుంచి చించోలి వరకు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం కోసం రూ.100కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు కోసం కృషి చేశారు. తాండూరు పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు ముమ్మరంగా చేపట్టారు. తాండూరులో జరిగిన ఓ అధికార సభలో మంత్రి సబితారెడ్డి ముందే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు వర్గపోరుతో బాహబాహికి దిగారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత సంవత్సరం అభివృద్ది పేరుతో వార్డు వార్డుకు ఎమ్మెల్యే ఫైలెట్ కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పల్లె పల్లెకు పట్నం కార్యక్రమం చేపట్టారు. కొన్ని రోజులపాటు పోటా పోటీగా పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు నుంచి టిక్కెట్ నాకే వస్తుందని ఓ పక్క ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి , మరోపక్క ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ప్రచారం చేసుకుంటూ ముందడుగువేస్తున్నారు. ఇటీవల కాలంలో సిఎం కేసిఆర్‌కు ఎమ్మెల్యే ఫైలెట్ దగ్గర కావడంతో ఎలాగైన టిక్కెట్ కన్‌ఫాం అంటూ ప్రచారం సాగుతోంది. మరో పక్క ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కొన్ని కార్యక్రమాల్లో తాండూరు టిక్కెట్ నాకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకే పార్టీలో ఇద్దరు నాయకుల మద్య వర్గ పోరు కొనసాగుతుంది. మూడేళ్లుగా తాండూరు పట్టణంలో నిధులు మూలుగుతూనే ఉన్నాయి. వర్గపోరుతో కోట్లాది రూపాయలు కార్యాలయానికే పరిమితమయ్యాయి. అభివృద్ది పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో ఛైర్‌పర్సన్ స్వప్న పరిమల్ ఓవైపు, వైస్ ఛైర్‌పర్సన్ దీపా నర్సింలు ఓ వైపు మద్దతు పలికారు. 42ఎజెండా అంశాలకు గాను 6అంశాలను వ్యతిరేఖిస్తూ వైస్ ఛైర్‌పర్సన్ దీపా నర్సింలుతోపాటు మెజార్టీ సభ్యులు వ్యతిరేఖించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్ సమావేశాన్ని కొనసాగించినా చివరకు మెజార్టీ సభ్యులు వ్యతిరేఖించడంతో దీపానర్సింలు పంతం నెగ్గినట్లు అయ్యింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రోజుల తరువాత జిల్లా కలెక్టర్‌కు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ దీపానర్సింలు 24మెజార్టీ సభ్యుల సంతకాలతో అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. తిరిగి ఛైర్‌పర్సన్ స్వప్న పరిమల్ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. ఇలా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గం నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. వర్గపోరు చివరకు ఎటువైపు పయనిస్తుందోనని తాండూరు ప్రజలు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News