జయశంకర్ భూపాలపల్లి: రాజలింగమూర్తి హత్యపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పందించారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఇలాంటి హత్య మొదటిదన్నారు. సంజీవ్, సాంబయ్య పోలీసులకు లొంగిపోయారని, కానీ రాజలింగమూర్తి హత్య వెనక సుపారీ ఉందేమోనని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వేరేవాళ్లు చంపి వీళ్లు లోంగిపోవడం అనేది అనుమానం కలుగుతోందని, మరో ఇద్దరు కూడా లొంగిపోతారని సమాచారం ఉందని గండ్ర పేర్కొన్నారు. ఇలాంటి హత్యలు పునరావృతం కావొద్దన్నారు. సిబిసిఐడి ద్వారా విచారించి న్యాయం జరిపించాలని గండ్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీ వద్ద గల టిబిజికెఎస్ ఆఫీసు ఎదురు గల్లీలో 15వ వార్డు మాజీ కౌన్సిలర్ సరళ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి (40) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
మృతుడు సామాజిక కార్యకర్తగా పనిచేసేవాడు. పలుచోట్ల సమాచార హక్కు చట్టం కింద సమాచారం సేకరించేవాడు. ఇదిలావుండగా, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై మాజీ సిఎం కెసిఆర్, పలువురు మాజీ మంత్రులతో పాటు సదరు గుత్తేదారు కంపెనీలపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి హత్య పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు భూవివాదాల్లో కూడా బాధితులకు న్యాయం జరిగేలా ప్రముఖ న్యాయవాది ద్వారా భూ సమస్యలను పరిష్కరించేవాడు.