Friday, November 22, 2024

మాటల్లో కాదు..చేతల్లో చూపించాలి

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఉదయం 11.00 గంటలకు అంబేద్కర్ సెంటర్‌లో బహిరంగ చర్చకు రేవంత్ రెడ్డి రావాలని ఈ నెల 1వ తేదీన ఎమ్మెల్యే గండ్ర సవాల్‌ను విసిరారు. ఈ క్రమంలో గురువారం అంబేద్కర్ సెంటర్‌కు ఎమ్మెల్యే గండ్ర దంపుతులు బయలుదేరడంతో క్యాంపు కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. తప్పనిసరి అంబేద్కర్ సెంటర్‌కి వెళ్తానని గండ్ర చెప్పటంతో పోలీసులు తమకు సహకరించాలని కోరారు. అనంతరం విలేకర్లతో ఎమ్మెల్యే గండ్ర వెంకరమణరెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాట్లాడారు.

రేవంత్‌రెడ్డి నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతే సహించేది లేదని హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలు అన్ని కూడా నిరాధారణపైనవి అని అన్నారు. ఆరోపణలను రుజువు చేయాలని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా రేవంత్ తన భాషా పదజాలాన్ని మార్చుకోవాలని సూచించారు. లేకపోతే బిఆర్‌ఎస్ కార్యకర్తలు చూస్తు ఊరుకోరని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌పై, రాష్ట్ర మంత్రులపై తను పర్యటిస్తున్న ప్రాంతాల ఎమ్మెల్యేలపై చేస్తున్న నిరాధార వ్యాఖ్యలపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన భూ కబ్జా అంశాలపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని గండ్ర స్పష్టం చేశారు. భూపాలపల్లి ప్రజల సంక్షేమం, అభివృద్ధ్దిపై నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.
పోలీసుల భారీ బందోబస్త్
జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే 144 సెక్షన్‌ను వారం రోజులపాటు విధించారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కిందిస్థాయి క్యాడర్‌ని ముందస్తు అరెస్ట్ చేశారు. అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేసింది. ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 250 మంది పోలీస్ సిబ్బంది బందోబస్త్‌లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News