అనుమతులకు మించి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి కొట్టారన్న ఆరోపణలపై సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు ఎంఎల్‌ఎ గూడెం మహీపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకొని పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ శ్రేణులు స్టేషన్‌కు తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. పటాన్‌చెరు మండలం, లక్డారం గ్రామ పరిధిలో గూడెం మధుసూదన్ రెడ్డి సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్ సప్లయర్స్ సంస్థను గత కొన్నేళ్లుగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. అయితే మైనింగ్ అనుమతులు ముగిసినా గూడెం మధుసూదన్ రెడ్డి అనుమతులను పునరుద్ధరించకుండా సుమారు ఏడాదిపాటు అనుమతులు లేకుండా మైనింగ్ నిర్వహించినట్లు,
ఆ సంస్థకు ప్రభుత్వం మైనింగ్ నిమిత్తం నిర్దేశించిన విస్తీర్ణానికి అదనంగా సుమారు 13 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్టు టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ధారించింది. అంతేకాకుండా తహశీల్దార్ ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.ఇదిలా వుండగా, మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం అనుమతులు ముగిసిన తర్వాత అనుమతులను పునరుద్ధరించకుండా మైనింగ్ నిర్వహిస్తే భారీ స్థాయిలో జరిమానాలు విధించడమే కాకుండా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గూడెం మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా పటాన్‌చెరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
గూడెం మధుసూదన్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పోలీసు వాహనాన్ని బిఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య వైద్య పరీక్షల అనంతరం సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు.