Friday, December 27, 2024

ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ పై ఎల్మపల్లి ప్రజల తిరుగుబాటు..

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నాయకులు అమ్రాబాద్ మండలం ఎల్మపల్లి గ్రామంలో దాడులకు పూనుకోవడం జరిగిందని, దాడులకు భయపడే నైజం తనది కాదని ప్రతి దాడులు తప్పవని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెచ్చరించారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మాట్లాడుతూ.. అమ్రాబాద్ మండలంలో కాంగ్రెస్ శ్రేణులు రాజకీయంగా తనను ఎదుర్కోలేక అబండాలు వేస్తూ దాడులకు ఉసిగొల్పి విమర్శలు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు, మేధావులు, రాజకీయ నాయకులు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారని క్షుణ్ణంగా గమనిస్తున్నానని, ప్రజా స్వామ్యంలో దాడులను కోరుకోవడం సరైంది కాదని ప్రజలు కూడా విమర్శిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

కాగా ఎల్మపల్లి గ్రామంలో 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్‌ఎస్ విధి విధానాలు నచ్చి పార్టీలో చేరడానికి సిద్ధమవ్వగా పోలీసుల పర్మీషన్‌తో ఎల్మపల్లి గ్రామానికి చేరుకోగా, స్థానిక ఎన్నికల మాదిరిగా గ్రూప్ రాజకీయాలు చేస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ మాపై దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎల్మపల్లి గ్రామంలో వంశీకృష్ణ అనుచరులు ప్రజలకు రెచ్చగొట్టి దాడికి ఉసగొల్పారని ఎమ్మెల్యే విమర్శించారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అచ్చంపేట పట్టణంలో కొన్న భూములను ఏ విధంగా అమ్మాలని ఆలోచనతోనే అమ్రాబాద్‌లో యురేనియంపై వారి పబ్బం గడుపుకోవడానికి ప్రతిసారి ప్రజలలో గందరగోళం, భయాందోళనలు కలిగే విధంగా అవాస్తవాలను సృష్టిస్తున్నారన్నారు. అమరావతి మండలంలోని కొన్ని గ్రామాలపై స్వచ్ఛందంగా ప్రజలు పునరావాసంపై వెళ్లాలని సంతకాలు చేసినా దానిపై కూడా రాజకీయం చేయడం నీచమైన చర్య అని అన్నారు.

తాను మొదటి నుంచి వ్యాపార రంగంలో ఉన్నానని, తెలివి తేటలతో వ్యాపారం కొనసాగిస్తూ సంపాదించడం జరిగిందన్నారు. ప్రజలకు మభ్యపెట్టి మోసం చేసి సంపాదించుకోలేదని ఆయన కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. తాను దాడులకు భయపడే ప్రసక్తి లేదని, ఈ మధ్య కాలంలో ఓపిక, సహనంతో గమనిస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో సాగులో ఉన్న ప్రతి గుంటకు, ఎకరాకు కృష్ణమ్మ జలాలతో సాగునీరు పారించి ప్రతి గుంటకు నీరు అందించడమే తమ ఏకైక లక్షమన్నారు. నియోజకవర్గంలో ఇటీవల చనిపోయిన అమ్మాయి నిఖితపై శవ రాజకీయాలు చేయడం శ్రేయస్కరం కాదని ఆయన మండిపడ్డారు. అదే విధంగా చెన్న కేశవ స్వామి ఉత్సవాల సందర్భంగా కూడా మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎలా ఉత్సవాలు జరుపుతారని కుల రాజకీయాలు చేస్తూ అడ్డు తగలడం, పోలీసులపై కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ ప్రాంతంలో ఎలా డ్యూటి నిర్వహిస్తారని ఆరోపణలు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, బాబా సాహెబ్ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా నియోజకవర్గంలో పాలన కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచామని, మూడవ సారి గెలిచి మంత్రిగా కొనసాగి అచ్చంపేట నియోజకవర్గ ప్రాంతాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేసే విధానంతో పాటు సస్యశ్యామలంగా మార్చడమే తన అభిమతమన్నారు. ఈ ప్రాంతంలో యురేనియం తీసే ప్రసక్తే లేదని అదే జరిగితే యురేనియం కన్నా ముందు తన గుండెల్లో గుణపం దిగిన తర్వాతే యురేనియం తీయాలని, యురేనియంపై అసెంబ్లీలో పట్టుబట్టి తీయకుండా తీర్మాణం చేసిన ఘనత తమదేనన్నారు. అమ్రాబాద్ మండలంలో తనపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని, ప్రజాస్వామ్య దేశంలో దాడులు చేయడం సరైందని కాదని, దీనిపై డిజిపికి ఫిర్యాదు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News