మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో :గులాబీ దళపతి కెసిఆర్ కోట రీ.. అప్పటి మంత్రుల వ్యవహారశైలి.. ఎంఎల్‌ఎల కేంద్రంగా రాజకీయాలు నడపడం.. ముఖ్యమంత్రి దగ్గర నుండి ఎంఎల్‌ఎల వరకు అధికారాన్ని చూసి అహంకారపూరితంగా వ్యవహరించడం తదితర కారణాలతో అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఘోరంగా ఓటమి పాలైందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ… బిఆర్‌ఎస్ అధిష్ఠానం తీరుపై తీవ్రస్థాయిలో
అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పార్టీ ఘోర ఓటమికి స్థానిక నాయకత్వమే కారణమని ఆరోపించారు. ఎన్నికలను ఎదుర్కోలేని నేతలకే మరోమారు అభ్యర్థులుగా నిలబెట్టడంతో ఎన్నికల్లో విఫలమయ్యామని వ్యాఖ్యానించారు. పదేళ్ళు అధికారంలో ఉండటం.. ఎంఎల్‌ఎలు నియంతల్లా వ్యవహరించడం.. అహంకారంగా మాట్లాడటంతో జనం పార్టీకి దూరమయ్యారని గుర్తుచేశారు. అధిష్ఠానంపై విశ్వాసం, నమ్మకం లేకనే నేతలు బిఆర్‌ఎస్‌ను వీడుతున్నారని వ్యాఖ్యాంచారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండి అపాయింట్‌మెంట్ అడిగినా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. కెసిఆర్ కోటరీతోనే పనిచేయించడం.. జగదీష్‌రెడ్డి లాంటి నేతలకు బాధ్యతలు అప్పగించి పనిచేయించడం మూలంగానే పార్టీ ఈ దుస్థితికి వచ్చిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ అమిత్ పోటీ చేయాలనుకున్నా కొందరు నేతలు వ్యవహరించిన తీరుతోనే పోటీ నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. కెసిఆర్ దక్షిణ తెలంగాణను పట్టించుకోలేదని, ఎస్‌ఎల్‌బిసి, బ్రహ్మణవెల్లెంల వంటి పెండింగ్ ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. తాను ఎంపి అయినప్పుడు లాగులు వేసుకొని తిరిగేవాళ్ళు తననే విమర్శిస్తారా? అంటూ ప్రశ్నించారు. పార్టీ మారిన ఎంఎల్‌సిలపై అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ నేతలు కోరారని, న్యాయసమీక్ష చేసి చట్టబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో తనకు పదవులు రాలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ్ట ఓటమికి సొంత నేతలే కారణమని, ఇప్పటికైనా పునఃసమీక్షించుకోవాలని సూచించారు.
గుత్తా వ్యాఖ్యలకు జగదీష్ కౌంటర్
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యలకు మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గుత్తా చాలా అనుభవశాలి అని పొగుడుతూనే ఇప్పుడు మాట్లాడిన విషయాలు అసెంబ్లీ ఎన్నికల ముందు తీసుకువస్తే బాగుండేందని సలహా ఇచ్చారు. సుఖేందర్‌రెడ్డి తనను ఉద్దేశించి ప్రత్యక్షంగా మాట్లాడారని అనుకోవడం లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత గుత్తా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.