హుజూరాబాద్ ఘోర పరాజయంతో అసమ్మతి చేతికి అస్త్రాలు
బల్మూరిని బలి పశువును చేశారు : జగ్గారెడ్డి
ఈటలకు మద్దతు ఇవ్వకతప్పలేదు : కోమటిరెడ్డి
సానుభూతి పనిచేసింది : పొన్నం ప్రభాకర్
మన తెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు టిఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్‌లో ఎక్కువ కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు వున్న అక్కసును, అసంతృప్తిని తీర్చుకునేందుకు రేవంత్‌పై సీనియర్లు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాన్ని అస్త్రంగా వాడుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హజూరాబాద్‌లో కాంగ్రెస్ దుస్థితికి రేవంత్‌రెడ్డి కారణమని ప్రొజెక్టు చేసి అధిష్టానం దృష్టిలో ఆయన ప్రతిష్టను బద్నాం చేయాలనే ప్రయత్నాలు మొదలైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ బల్మూరిని రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు బలిపశువును చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు.
డిపాజిట్ వస్తే రేవంత్ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రచారానికి రేవంత్ మనుషులు సిద్ధంగా వున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. అంతకుముందు హుజూరాబాద్ ఫలితాలు ఊహించినట్లుగానే వస్తున్నాయని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. అప్రజాస్వామికంగా మంత్రివర్గం నుంచి తొలగించారనే అంశాన్ని ఈటల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని ప్రభాకర్ అన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలు జీర్ణించుకోలేకపోయారని.. ఇది బిజెపి విజయంగా బండి సంజయ్ చెప్పడం దురదృష్టకరమని పొన్నం ఎద్దేవా చేశారు. ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదని, ఈటల రాజేందర్ ఎక్కడా కూడా బిజెపి అభ్యర్థి అని చెప్పుకోలేదని, ఇది పూర్తిగా ఈటల గెలుపని ప్రభాకర్ అభివర్ణించారు. కాంగ్రెస్ ఓటమి ముందే ఊహించిందేనని, ఉత్తమ్ పిసిసిగా ఉన్నప్పుడు కౌశిక్‌రెడ్డి మీద దృతరాష్టుడి ప్రేమ చూపించారని ఆయన ఆరోపించారు.
అంతిమంగా అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిందని, రేవంత్‌రెడ్డి వచ్చినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కాంగ్రెస్ పరిస్థితిపై సంచలన కామెంట్స్ చేశారు. శత్రువు శత్రువుకి మిత్రుడు.. అందుకే ఈ ఎన్నికల్లో కెసిఆర్ శత్రువయిన ఈటల రాజేందర్‌కు మేం మద్దతివ్వక తప్పలేదని రాజకీయంగా తీవ్ర చర్చను లేవనెత్తారు. తాము గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి ఉండేవని, అలా జరిగితే టిఆర్‌ఎస్ లాభపడేదని వ్యాఖ్యానించారు. ఈటలకు పరోక్షంగా మద్దతిచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలతో తాము ఏకీభవించడం లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. తాము బిజెపికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తేలేదన్నారు. హుజూరాబాద్‌లో గెలుపు బిజెపిది కాదని, ఈటలది అని అన్నారు.
టిపిసిసి చీఫ్‌గా నియామకమైనప్పట్నించీ..
రేవంత్‌రెడ్డిని టిపిసిసి చీఫ్‌గా నియమించినప్పట్నించీ టి కాంగ్రెస్‌లోని సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన తమను కాదని, టిడిపి నుంచి వలస వచ్చిన నేతకు టిపిసిసి పదవి ఇవ్వడం పట్ల వారు గుర్రుగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలైతే తాను గాంధీభవన్‌లోకి అడుగుపెట్టేది లేదని శపథం చేశారు. ఆయన దారిలోనే మరికొందరు సీనియర్లు కూడా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. తమ సలహాలు తీసుకోకుండానే రేవంత్‌రెడ్డి దూకుడుగా వెళ్తున్నారని కొందరు సీనియర్లలో అసంతృప్తి ఉంది. ఇదే విషయమై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌కు కూడా కొందరు నేతలు రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అయితే అసంతృప్తులను సంతృప్తి పర్చేందుకు అధిష్టానం ఎఐసిసిలో కొంతమంది నేతలకు కీలక పదవులు కట్టబెట్టింది. దానిలో భాగంగా జాతీయాంశాలపై ఆందోళనలు నిర్వహించేందుకు సోనియాగాంధీ కమిటీని వేశారు. కమిటీ చైర్మన్‌గా దిగ్విజయ్‌సింగ్‌ను నియమించగా.. ఈ సభ్యుల్లో ప్రియాంక గాంధీతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చోటు కల్పించారు.
మొన్నా మధ్య జరిగిన దళిత, గిరిజన దండోరా సమయంలోనూ తమకు ముందస్తు సమాచారం లేకుండా రేవంత్‌రెడ్డి వేదికలను ప్రకటించడంపై కోమటిరెడ్డి అలిగారు కూడా. కానీ రేవంత్ స్పీడుతో అయనను అడ్డుకునే రిస్క్ చేయలేక అవకాశం కోసం ఎదురుచూశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడే పిసిసి బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి తన సత్తాను నిరూపించుకునేందుకు దీనిని వేదికగా చేసుకుంటారని అంతా భావించారు.కానీ వాస్తవంలో జరిగింది వేరు. ఆయన ఉప ఎన్నికను లైట్ తీసుకున్నారు. కొండా సురేఖను బరిలోకి దించాలని రేవంత్ ఎంతగానో ప్రయత్నించారు. అయితే ఆమె పెట్టిన షరతులతో కంగుతిన్నారు. దీంతో ఆమెను తప్పించి చివరి నిమిషంలో బల్మూరి వెంకట్‌ను బరిలోకి దించారు. సరిగ్గా నామినేషన్‌ల చివరి రోజున బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు.
నామినేషన్ సందర్భంగా టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌మధుయాష్కీ గౌడ్, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. అదే రోజు భారీ హంగామా చేశారు. ఆ తర్వాత గాంధీభవన్ ఎన్నికల వ్యూహంపై సమావేశం ఏర్పాటు చేసుకుని పలు అంశాలపై చర్చించారు. మండలాల వారీగా ఇంఛార్జిలను నియమించారు. ఇదంతా బాగానే ఉన్న ప్రచారం విషయంలో ముఖ్య నేతలు చడీ చప్పుడు చేయలేదు. నామినేషన్ వేసి వచ్చిన తర్వాత హుజూరాబాద్ వైపు ఏ ఒక్క సీనియర్ నేత కన్నెత్తి చూడలేదు.స్వయంగా పిసిసి చీఫ్ రేవంత్ నిరుద్యోగ జంగ్ సైరన్ పేరిట సభలు, సమావేశాలంటూ తిరిగారు. ముఖ్య నేతలెవరూ హుజూరాబాద్‌వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ నామమాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
అస్త్రాలు సిద్ధం చేసుకున్న సీనియర్లు…
గత అసెంబ్లీ ఎన్నికల్లో హూజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు 61వేల ఓట్లు లభించాయి. తాజా ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవదన్న విషయం విదితమే. కానీ కనీస పోటీ ఇవ్వకుండా ప్రత్యర్థి మెజార్టీనైనా తగ్గించే ప్రయత్నం చేయకుండా నిర్లక్షంగా వ్యవహరించారని రేవంత్‌పై ప్రచారం మొదలయ్యేఅవకాశం ఉంది. దీనికి తోడు ఈటల రాజేందర్‌కు లోపాయికారిగా మద్దతు ప్రకటించారని టిఆర్‌ఎస్ నేత, మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను సీనియర్లు ఆధారంగా ఉంచుకునే అవకాశం లేకపోలేదు.